కరోనాపై నేరపూరిత నిర్లక్క్ష్యం : జేపీ నడ్డా

11 Aug, 2020 01:57 IST|Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజం

టీఆర్‌ఎస్‌ను దింపి బీజేపీని అధికారంలోకి తేవాలి

జిల్లాల బీజేపీ కార్యాలయాలకు వర్చువల్‌గా భూమిపూజ

కరోనాపై పోరులో ప్రధాని మోదీ ప్రపంచానికే దారి

సాక్షి, హైదరాబాద్‌ : కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణలోని కేసీఆర్‌ సర్కార్‌ నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టులు నిలదీయడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందు కు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణ పేట్, వికారాబాద్‌ జిల్లాల్లో బీజేపీ కార్యాల యాలకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా(ఆన్‌లైన్‌ ద్వా రా) ఆయా కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ప్రపంచానికే దారి చూపుతున్న మోదీ.. 
కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికే దారి చూపుతున్నారని, డబ్ల్యూ హెచ్‌వో, యూఎన్‌ లాంటి సంస్థలు కూడా భారత్‌ను చూసి నేర్చుకోవాలని కితాబు ఇచ్చా యని నడ్డా గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించేందుకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’ప్రవేశపెడితే కేసీఆర్‌ సర్కార్‌ దీన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, దీంతో ఎంతోమంది నిరుపేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ అందక ఒక జర్నలిస్టు మృతి చెందడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.

తెలంగాణలో మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ ఎంఐఎం, కమ్యూనిస్టు కార్యాలయాలు సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదులకు అడ్డాగా మారాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తుంటే కేసీఆర్‌ సర్కార్‌ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని, టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు