Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం

13 Jun, 2022 06:18 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నికపై పార్టీలతో చర్చలు

యూపీఏ పక్షాలతోనూ సంప్రదింపులు

రంగంలోకి రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నా«థ్‌సింగ్‌లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే.

ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బరిలో దిగడం తెలిసిందే.

మరిన్ని వార్తలు