జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?

8 Dec, 2022 12:40 IST|Sakshi

మరో ప్రస్థానం పేరిట కృష్ణారావు క్రియాశీలక అడుగులు

నియోజకవర్గాల వారీగా ‘ఆత్మీయ’ సమ్మేళనానికి శ్రీకారం

అచ్చంపేట నుంచి షురూ.. ఉమ్మడి జిల్లాలో నిర్వహణకు కసరత్తు !

మలి దశ ఉద్యమకారులకు ఆహ్వానం.. అసంతృప్త గులాబీలకు గాలం

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కార్యాచరణ

మాజీ మంత్రి తీరుపై సర్వత్రా చర్చ.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆరా? 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సీనియర్‌ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది.


జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.  


పూడ్చలేనంత పెరిగిన గ్యాప్‌.. 

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్‌ఎస్‌లో చేరడంతో సీన్‌ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్‌ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్‌ పూడ్చలేనంతగాపెరిగింది.  


ఏకం చేసే దిశగా.. 

మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.  

అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. 
ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్‌ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్‌ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్‌ ఘటనను ఫోకస్‌ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. 
ఇటీవల మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్‌ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్‌.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?)

మరిన్ని వార్తలు