‘కాంగ్రెస్‌ నాకు ఉప ముఖ్యమం‍త్రి ఆఫర్‌ ఇచ్చింది’

24 Aug, 2020 12:29 IST|Sakshi

భోపాల్‌ : అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలతో కాంగ్రెస్ మధ్య ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసిందని బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. రాష్ట్రంలోని గ్వాలియర్‌లో మూడు రోజుల బీజేపీ మెంబర్ షిప్ (పార్టీ సభ్యత్వ నమోదు) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య మాట్లాడుతూ.. 2018 రాష్ట్ర ఎన్నికల తరువాత తను ఇంకా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదివిని ఇస్తానని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించి.. తను ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించునట్లు తెలిపారు. కాగా కాగా, మార్చిలో కాంగ్రెస్‌ను వీడిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సింధియా వెంట ఉన్న 22  మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి బీజేపీకి మద్దతు తెలుపడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారం చేపట్టారు. (రాజస్తాన్‌ సంక్షోభం : సింధియా ట్వీట్‌)

అయితే సింధియా కాంగ్రెస్ తనకు ఈ పదవి ఇచ్చిందని  బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. ‘కమల్ నాథ్, దిగ్విజయ్‌ సింగ్ 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేస్తారని నాకు అర్థమైంది. పార్టీ అధికారంలోకి రావడానికి 10 రోజుల్లో వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తాం వంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజలకు ద్రోహం చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ 10 రోజుల్లో రూ .2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని, లేకపోతే పదకొండవ రోజున ముఖ్యమంత్రిని తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు" అని ఆయన అన్నారు. సింధియాకు మధ్యప్రదేశ్‌‌ ఉప ముఖ్యమంత్రి‌ పదవిని ఆఫర్‌ చేశారని ఈ ఏడాది మార్చిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ అన్నారు. అయితే ఈ విషయాన్ని కమల్ నాథ్ కొట్టిపారేశారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్‌!)

అదే విధంగా గ్వాలియర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేసిన ఆందోళనపై సింధియా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన అయిదు నెలల తర్వాత బీజేపీ డ్రైవ్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారన్నారు. కాగా రాష్ట్రంలోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ 27 నియోజకవర్గాల్లో 16 సెగ్మెంట్లు  గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఉప ఎన్నికలపై దృష్టి సారించిన అధికారిక బీజేపీ శనివారం ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు