బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్‌ చేరి..

19 Aug, 2023 16:39 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అనుచరుడు సమందర్ పటేల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి సమందర్ కాంగ్రెస్‌లో శుక్రవారం చేరారు. 

'కాంగ్రెస్ పార్టీ భావాజాలంపై ఇష్టంతోనే సమందర్ చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీ నచ్చే ఇక్కడి వచ్చారు. ఇదే నిజాన్ని ప్రజలకు కూడా చెబుతారు. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ బీజేపీ కుట్రలు పన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా అయ్యారు. బీజేపీ అధికారంలో నేరాలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. శివరాజ్ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలకాలని అనుకుంటున్నారు.' అని కమల్ నాథ్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి తిరిగిరావడంపై సమందర్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు. సింధియా సహచరులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ తరుపున శివపురి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బైజ్‌నాథ్ సింగ్ యాదవ్ కూడా సింధియాను వదిలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. సింధియా మరో అనుచరుడు రాకేశ్ గుప్తా కూడా ఇటీవలే బీజేపీని వదలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.    

ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్..

మరిన్ని వార్తలు