Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి

28 Aug, 2022 08:33 IST|Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇరువురి ప్రత్యేక భేటీ 

అనంతరం వివరాలు వెల్లడించిన ఎంపీ కె.లక్ష్మణ్‌

ప్రధాని మోదీ హయాంలో  క్రీడలకు ప్రాధాన్యం వచ్చిందన్న మిథాలీరాజ్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో, సాయంత్రం సినీ నటుడు నితిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  

రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... 
శనివారం రాత్రి నోవాటెల్‌కు వచ్చిన సినీ నటుడు నితిన్‌ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్‌ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్‌ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్‌ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్‌లో నడ్డా పేర్కొన్నారు. 

క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్‌ 
ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్‌ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్‌ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ 
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు.  

ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్‌: కె.లక్ష్మణ్‌
నితిన్, మిథాలీరాజ్‌లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్‌ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు.  

చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్‌ భేటీ)

మరిన్ని వార్తలు