రాష్ట్రంలో 9 లక్షల కోట్ల అవినీతి

23 Jun, 2022 01:55 IST|Sakshi

సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డారన్న కేఏ పాల్‌ 

సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. తెలంగాణతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలోనూ కేసీఆర్‌ కుటుంబసభ్యులు అనేక ఆస్తులు కూడబెట్టారని అన్నారు. బుధవారం సీబీఐ డైరెక్టర్‌ సుబో«ధ్‌కుమార్‌ జైశ్వాల్‌ను కలిసిన పాల్‌ అనంతరం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 

ఖర్చు తక్కువ..దోచుకున్నది ఎక్కువ 
‘తెలంగాణలో జరుగుతున్న ఈ అవినీతిపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశా. వెంటనే విచారణ చేపట్టాలని కోరా. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతిని చూడలేదు. రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉంది. అయితే కేసీఆర్‌ సర్కార్‌ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్‌ రూ.1.05 లక్ష కోట్లు కాగా, రూ.35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.75 వేల కోట్లు దోచుకున్నారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది.

రూ.2 వేల కోట్ల అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగతా అంతా దోచుకున్నారు..’ అంటూ పాల్‌ ఆరోపణలు గుప్పించారు. ఈ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలన్నారు.   

మరిన్ని వార్తలు