స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌లో వర్గ పోరు

23 Jan, 2023 20:07 IST|Sakshi

వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే..  మరొకరు ఎమ్మెల్సీ.  ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఇద్దరూ దళిత నేతలే. కాని వారిద్దరికి అసలు పడదు. మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. తప్పు చేయలేదు.. తలవంచను అని ఒకరంటే, సీఎం కేసిఆర్‌కు వీరవిధేయుడిని తానేనంటు మరో నాయకుడు అంటున్నారు. ఓరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏమిటా కథ?

ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలు సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కామనే. కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి.

గతం నుంచీ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార బిఆర్ఎస్‌లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు.

లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికి తలవంచను.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివందనం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల కేసిఆర్‌కు రాజయ్య పాదాభివందనం చేయడంతో.. తప్పు చేసిన వాళ్ళే తలవంచి పాదాభివందనం చేస్తారంటూ చేసిన కామెంట్స్.. రాజయ్యను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రాజయ్య సైతం తానేమి తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే... గెలుపు నాదేనని స్పష్టం చేశారు.

కేసిఆర్ నిర్ణయాలకి.. ఆయనకు వీరవిధేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా  కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే  స్టేషన్ ఘన్‌పూర్‌   టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మింగుడుపడటం లేదు. టార్గెట్ స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్ అన్నట్లుగా కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సార్‌కే టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగగానే వ్యాఖ్యానిస్తున్నారు. కడియం రాజకీయ వైఖరి, ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు.. అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది. రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుకూలతలను అధిష్ఠానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇద్దరి రాజకీయ పరిస్థితి తయారైంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. వీరివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని  ఆ నియోజకవర్గ కేడర్ కోరుతోంది.

మరిన్ని వార్తలు