బాబుకు క్రెడిబిలిటీ లేదు.. పవన్‌కు క్యారెక్టర్‌ లేదు

14 Jul, 2022 04:44 IST|Sakshi

బురద జల్లడం తప్ప ఎల్లోమీడియాకు పనిలేదు

సీఎం జగన్‌ చేస్తున్న మేలు వారి కళ్లకు కనిపించడం లేదు

కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ ప్రశంసలేవీ వారికి వినిపించవు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు.. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌కు క్యారెక్టర్‌ లేదు, ఎల్లో మీడియాకు బురదజల్లడం తప్ప మరో పనిలేదు. ఒకరోజు చంద్రబాబు చెప్పింది, మరో రోజు దత్తపుత్రుడు చెప్పింది రాస్తారు. లేదంటే ప్రజలను మభ్యపెట్టేలా అబద్ధపు రాతలు రాస్తారు. ఎవరెన్ని కూసినా, ఎన్ని రాసినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను మార్చలేరు. ప్రజలు జగన్‌ పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారో మొన్న జరిగిన ప్లీనరీలో తేటతెల్లమైంది. వారెన్ని కుట్రలు చేస్తున్నా, జనం జగన్‌ వెంటే ఉన్నారని ఓర్వలేకపోతున్నారు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమాలపై ఎల్లో మీడియా రాయదు. రెండు చోట్ల చిత్తుగా ఓడిన దత్తపుత్రుడి మాటలకు విలువ ఇస్తుంది. దీన్నిబట్టి ఈ  ప్రభుత్వంపై వారికెంత అక్కసుందో అర్ధమవుతోంది. పవన్‌కు కావాల్సింది మూడు ఆప్షన్లు కాదు.. నాలుగో  ఆప్షన్‌ ప్యాకేజీయే. పప్పుగా పేరు తెచ్చిపెట్టిన కందిపంటను గుర్తుపట్టలేని లోకేష్‌ రైతుల కోసం సీఎంకు లేఖలు రాస్తారు. ఇదో విడ్డూరం. రైతులకు ప్రభుత్వం చేసే మంచిపై సింగిల్‌ కాలం రాయని పచ్చపత్రికలు నిత్యం తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయి.

ఏ కుటుంబాల కోసమైతే రాస్తున్నారో వారే తాము చెప్పింది వేరు.. వాళ్లు రాసేది వేరని అంటున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ముఖం మీద చెబుతున్నా సిగ్గు లేకుండా అబద్ధాలు రాస్తున్నారు. చంద్రబాబు హయాంలో రైతుల బలవన్మరణాలు ఆత్మహత్యలే కాదు.. వారు అనర్హులంటూ ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ద్రోహం చేశారు. అనుకూలంగా ఉన్న వారికి రూ.1.50 లక్షలు అప్పులకు సర్దుబాటు చేసి, మరో రూ.3.50 లక్షలు జాయింట్‌ అకౌంట్‌లో వేసి వడ్డీలు తినమనేవారు. బాబు హయాంలో పరిహారం దక్కని 471 రైతుల కుటుంబాలకు సీఏం వైఎస్‌ జగన్‌ రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు.

కారణాలు వెతక్కుండా ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నారు. ఇదంతా వారికి కన్పించడంలేదు. సవాల్‌ విసురుతున్నాం. ఆత్మహత్యకు పాల్పడి పరిహారం దక్కని వారిలో పట్టాదార్‌ పాసు పుస్తకం, సీసీఆర్సీ కలిగిన కౌలు రైతులు ఒక్కరినైనా చూపించండి. మూడేళ్లుగా ఏటా 16 నుంచి  17లక్షల టన్నుల ధాన్యం అదనంగా పండిందంటే రైతులు పండించకుండానే వచ్చిందా? ముందస్తుగా సాగు నీరిస్తుంటే క్రాప్‌ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబులా బేషరతుగా రుణమాఫీ అంటూ రైతులను మోసగించలేదు.

రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. సాగు చేసే ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సీఎం వైఎస్‌ జగన్‌ని ప్రశంసిస్తుంటే వీరికి కన్పించలేదు. బాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల డ్రిప్‌ ఇరిగేషన్‌ బకాయిలు చెల్లించడమే కాదు, రూ.1,395 కోట్లతో మళ్లీ శ్రీకారం చుట్టాం. ఆయిల్‌పామ్‌ రైతులకు టన్నుకు రూ.600 చొప్పున రూ.85 కోట్ల బోనస్‌ ఇచ్చాం. గతంలో ఏనాడూ టన్ను రూ.10 వేలకు మించి రాలేదు. నేడు టన్ను రూ.23,500 వరకు ధర లభిస్తోంది. ఓఈఆర్‌ 19.22 శాతం ఇచ్చాం. ఆయిల్‌ పామ్‌ రైతుల సంతోషం వారికి కన్పించదు.’ అని మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు