ఏంటి మీ గొప్ప.. పార్టీలో మీరెంత

17 Sep, 2021 03:02 IST|Sakshi
కాలవ శ్రీనివాసులును చుట్టిముట్టి ప్రశ్నిస్తున్న శింగనమల టీడీపీ కార్యకర్తలు

టీడీపీ ఎస్సీ శ్రేణులపై నోరు పారేసుకున్న కాలవ శ్రీనివాసులు

ఎస్సీ నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనమేమిటని నిలదీసిన కార్యకర్తలు

అణగారిన వర్గాలను తొక్కేస్తున్నారంటూ ఆవేదన

టీడీపీ కార్యాలయంలో గందరగోళం

అనంతపురం (శ్రీకంఠం సర్కిల్‌): ‘ఏంటి మీ గొప్ప.. పార్టీలో మీరెంత. మీరా పార్టీకి పని చేసింది’ అంటూ అనంతపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆ పార్టీ ఎస్సీ శ్రేణులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీ నియోజకవర్గంలో 41 వేల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ గెలిచింది. మీరా నాతో మాట్లాడేది. కులానికి.. అంటే తలా గరిటెడు అన్నట్టుగా ఉంది మీ వాదన. చెప్పినట్టు విని ఉంటే సరేసరి. లేదంటే చర్యలు తప్పవు. కార్యకర్తల సలహాలు తీసుకునే దుస్థితిలో ఇక్కడెవరూ లేరు. ఖబడ్దార్‌ నోరు అదుపులో పెట్టుకోండి’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో అగ్రకులాలకు పెద్దపీట వేస్తే మేమంతా ఏం కావాలయ్యా’ అని అడిగినందుకు కార్యకర్తలపై రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు కుర్చీలతో కాలవపై దాడి చేసేవరకు వెళ్లారు. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. గురువారం అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. 

అసలేం జరిగిందంటే..
బుధవారం రాత్రి 40 మందితో కూడిన అనంతపురం టీడీపీ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బండారు శ్రావణిశ్రీని కాదని పార్టీ కమిటీల నియామకం, పార్టీ కార్యక్రమాల అమలు బాధ్యతలను ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలకు అప్పగించింది. దీంతో శ్రావణిశ్రీ గురువారం ఈ విషయమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు అనంతపురంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఇందుకు పార్టీ కీలక నేతలు అనుమతించకపోవడంతో ఆమె కార్యకర్తలతో కలిసి వెనుదిరిగారు. అనంతరం శింగనమల నియోజకవర్గం కార్యకర్తలు పెద్దఎత్తున శ్రావణిశ్రీ ఇంటికి చేరుకుని ఆమెతో చర్చించారు.

అనంతరం తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కాలవను కలసి చర్చిద్దామని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో ఉన్న కాలవతో గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేయబోయారు. ఊహించని రీతిలో కార్యకర్తలపై కాలవ చిందులేయడంతో వివాదం ముదిరింది. ‘పార్టీ వీడుతామని బెదిరిస్తే భయపడాలా? చాలా మందినే చూశాం. పార్టీలో విర్రవీగిన వాళ్లంతా కనిపించకుండా పోయారు. మీరెంత..’ అంటూ కార్యకర్తలను చులకన చేసి మాట్లాడటంతో కార్యకర్తలు ఆయనను చుట్టుముట్టి కుర్చీలతో దాడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను బయటకు పంపించివేశారు.

కార్యాలయం బయట పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తల కష్టాలు పంచుకుంటామని చెప్పే నీతులు కేవలం మాటలకే పరిమితమా అంటూ నిందించారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యకర్తలంతా వెళ్లిపోయిన అనంతరం నూతన కమిటీలోని శ్రీధర్‌ చౌదరి సమక్షంలో కేక్‌ కట్‌ చేసి మీడియాతో మాట్లాడిన కాలవ శ్రీనివాసులు.. తమదంతా ఒకే కుటుంబం అంటూ వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

మీడియాలో వస్తున్నదంతా అవాస్తవమని బుకాయించారు. కాగా, శింగనమల నియోజకవర్గ బాధ్యతలను మరొకరికి అప్పగించడంపై బండారు శ్రావణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ అధినేతకు లేఖ రాశారు. అంతకుముందు టీడీపీ కార్యాలయ పరిసరాలు ఫ్యాక్షన్‌ సినిమా సన్నివేశాలను తలపించాయి. ఎటు చూసినా వాహనాల హారన్‌ మోతలు.. పరుగులు తీస్తున్న జనంతో ఆ ప్రాంతమంతా ఉలికి పాటుకు గురైంది. 

మరిన్ని వార్తలు