ఓటమి పాఠం: వ్యూహం మార్చిన కవిత

21 Feb, 2021 15:29 IST|Sakshi

ప్రజలకు చేరువయ్యేందుకు యత్నం 

నెలలో ఐదు రోజులు జిల్లాలోనే ఉండాలని నిర్ణయం

సాక్షి, నిజామాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఏడాది పాటు జిల్లా రాజకీయాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత.. మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారా? ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలలో ఐదు రోజుల పాటు జిల్లాలోనే పర్యటించాలని నిర్ణయించుకున్న ఆమె.. ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు.

గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆమె పక్షం రోజులకు ఒకసారి జిల్లాకు వచ్చే వారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకే ఎక్కువ సమయం పట్టేది. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన సామాన్య ప్రజలు, కింది స్థాయి కార్యకర్తలు కవితను కలవడం కష్టంగా మారేది. తమ సమస్యలను విన్నవించుకునేందుకు సమయం దొరకక ఇబ్బంది పడే వారు. ఇప్పుడు అలా కాకుండా కవిత జిల్లా వాసులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని కవిత కార్యాలయం మళ్లీ కిటకిటలాడుతోంది. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.

స్థానిక సంస్థలకు భరోసా.. 
2019 ఎన్నికల్లో పసుపుబోర్డు అంశం తెరపైకి రావడం తదితర కారణాలతో కవిత రెండోసారి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. అయి తే, ఏడాది తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్లయింది. ఇటీవలే స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలు నిర్వహించి నిధులు, విధుల అంశాన్ని చర్చించారు. ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎంను కలవాలని నిర్ణయించారు.

బీసీల అభ్యున్నతి కోసం.. 
జిల్లాలోని బీసీ కులాల వారికి వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చడంపై కవిత దృష్టి పెడుతున్నారు. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రిని జిల్లాకు రప్పించి బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే భవన్‌ పేరుతో జిల్లా బీసీభవన్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఉద్యోగార్ధుల కోసం బీసీ స్టడీ సర్కిల్‌కు ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎస్సీ ఉప కులాల ప్రతినిధులతోనూ కవిత సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు