కమల్‌హాసన్‌కు అరుణాచలం ఝలక్‌

26 Dec, 2020 08:23 IST|Sakshi

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు కమల్‌హాసన్‌కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది.  మక్కల్‌ నీది మయ్యం ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఝలక్‌ ఇచ్చారు. కమల్‌తో పాటు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ అరుణాచలం ఎంఎన్‌ఎంను వీడి బీజేపీలో చేరారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతునివ్వాలని కోరితే కమల్‌ తిరస్కరించారని, అందుకే పార్టీని వీడినట్లు అరుణాచలం చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

అనంతరం అరుణాచలం మీడియాతో మాట్లాడుతూ ఎంతో దూరదృష్టితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుదామని ఉన్నతస్థాయి పార్టీ సమావేశంలో కమల్‌ను కోరానని అన్నారు. అయితే రైతు సంక్షేమాన్ని విస్మరించి పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన వ్యవహరించడం వల్లనే కమలదళంలో చేరానని చెప్పారు. కమల్‌ పార్టీ పెట్టిన నాటి నుంచి మక్కల్‌ నీది మయ్యం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అరుణాచలం ఆ పార్టీని వీడడం గమనార్హం. 

కమల్‌పై ఫిర్యాదు: 
చెన్నైలో కమల్‌ ఇటీవల నిర్వహించిన పార్టీ మహిళా విభాగం సమావేశంలో హిందువుల దేవుళ్లను అసభ్యంగా విమర్శించి మహిళల మనోభావాలను గాయపరిచిన కమల్‌హాసన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నై ఆర్‌కే నగర్‌ పోలీసులకు సెల్వం అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశాడు. ప్రజలను హింసాత్మక ధోరణివైపు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు