Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది!

5 May, 2021 07:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌ను అంతర్మథనంలో పడేసింది. కనీసం మూడోస్థానం కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమికి గల కారణాలపై చర్చించారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసుంటే బాగుండేదని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. 

క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళిక 
పార్టీలో సమూల మార్పులు, క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేద్దామని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక, కొత్త నిర్ణయాలు, మార్పులతో ముందుకు సాగుదామని, త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తానని కమల్‌ నేతల వద్ద  పేర్కొన్నారు.

ఈ సమావేశంపై మక్కల్‌ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు పొన్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నామని తెలిపారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ఉంటే కనీసం మూడో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయాన్ని సమావేశం ముందు పలువురు ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్‌ కామెంట్స్‌ వైరల్‌

మరిన్ని వార్తలు