అదే మీ చేతిలోని బ్రహ్మాస్త్రం: కమల్‌

20 Nov, 2020 14:32 IST|Sakshi

చెన్నై: మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్‌ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్‌ అప్‌ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్‌ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్‌. (చదవండి: ఇలాగైతే పార్టీ ఎత్తేస్తా.. కమల్‌హాసన్‌ హెచ్చరిక..!)

వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు లెజండరీ నాయకులైన జయలలిత, కరుణానిధిలను కోల్పోయిన తర్వాత తమిళనాడులో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కమల్‌ హాసన్‌ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2018, ఫిబ్రవరిలో కమల్‌ మక్కల్‌ నీధి మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోల బరిలో నిలిచిన కమల్‌ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌ పార్టీ ‘జీవనాధారం, ఉద్యోగాలు, తాగునీరు’ అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచి కమల్‌ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్‌ ఎన్నికల్లో పోటీ గురించి పునరాలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు