అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక

20 Feb, 2021 18:03 IST|Sakshi

చెన్నై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా అగ్ర నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఇద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరూ శనివారం భేటీ కావడంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కమల్‌హాసన్‌కు రాజకీయంగా సహకరించేందుకు రజనీకాంత్‌ రాబోతున్నారని తెలుస్తోంది. 

చెన్నెలోని పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్‌ నివాసానికి శనివారం మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్‌ వెళ్లారు. రజనీకాంత్‌తో కొన్ని నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే వీరి ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో రజనీకాంత్‌ను పరామర్శించేందుకు కమల్‌ వచ్చాడని అధికారికంగా తెలుస్తోంది. కాకపోతే దానితోపాటు రాజకీయంగా కూడా చర్చించేందుకు కమల్‌ వచ్చాడని సమాచారం.

2018లో కమల్‌హాసన్‌ ప్రారంభించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీకి రజనీకాంత్‌ మద్దతు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీతో కమల్‌కు ఒప్పందం జరిగిందని.. ఇక రజనీకాంత్‌ మద్దతు ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు కావొచ్చని కమల్‌ హాసన్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌తో సమావేశమైనట్లు తమిళ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు ఇటీవల జైలు నుంచి వచ్చిన శశికళ రావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా రజనీ, కమల్‌ భేటితో మరింత ఉత్కంఠగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతోందననే ఆసక్తిగా మారింది. 

మూడోసారి అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే భావిస్తుండగా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని డీఎంకే తీవ్రంగా శ్రమిస్తుండగా.. బీజేపీ మాత్రం తొలిసారిగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రస్తుత అధికార పార్టీకి అండగా నిలుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు