కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీపై కమల్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

28 Sep, 2022 21:17 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఎంత మంది ఉండనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ భేటీ కావటం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కమల్‌నాథ్‌ సైతం పోటీలో నిలువనున్నారని వినబడింది. అయితే.. తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. 

‘రాహుల్‌ గాంధీతో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరాను. అప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుందని చెప్పాను. పార్టీలో పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయని కూడా ఆయనకు వివరించాను. అయితే, అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ సుముఖంగా లేనని తేల్చి చెప్పారు. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలనుకోవడంలేదు గనకే ఎన్నికలు జరుగుతున్నాయి. ‘ అని తెలిపారు కమల్‌నాథ్‌.  మరి జేపీ నడ్డా ఎలాంటి ఎన్నిక జరగకుండానే భాజపా అధ్యక్షుడయ్యారు కదా అని విమర్శలు చేశారు. ఎన్నికల విషయం పక్కనబెడితే.. నడ్డాను అధ్యక్షుడిని చేసే ముందు భాజపా 10మంది నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని కమల్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు మీరెందుకు పోటీ చేయట్లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి సోనియాతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు కమల్‌నాథ్‌. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 నెలల సమయం ఉందని.. ఈ సమయంలో తాను మధ్యప్రదేశ్‌ను వదిలిపెట్టబోనన్నారు. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపడితే తన దృష్టంతా మధ్యప్రదేశ్‌ వైపు ఉండదని.. ఆ పరిస్థితి తనకు ఇష్టంలేదని స్పష్టంచేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు తాను సిద్ధంగా లేనట్టు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి తన దృష్టిని వేరే వైపు పెట్టదలచుకోలేదన్నారు.

ఆయన్నే అడగండి..
ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరైనా తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుందని కమల్‌నాథ్‌ సూచించారు. అలాగే, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. శశిథరూర్‌ నామినేషన్‌ గురించి ప్రస్తావించగా.. ఆయనతో చర్చించానని.. ఎన్నికలు ఉన్నందునే ఆయన నామినేషన్‌ వేయాలనుకొంటున్నారన్నారు.  దిగ్విజయ్‌ సింగ్‌ పోటీచేసే అవకాశం ఉందా? అని అడగ్గా.. ఆయనకు ఇష్టం ఉందో లేదో దిగ్విజయ్‌నే అడగాలని సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లో ఏర్పడిన పరిస్థితులకు గెహ్లాట్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తారా అని అడగగా.. ఆ రాష్ట్ర విషయాల్లో తాను కలుగజేసుకోబోనని, మధ్యప్రదేశ్‌పైనే తన దృష్టంతా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగ్విజయ్‌ సింగ్‌?

మరిన్ని వార్తలు