ఠాక్రే-పవార్‌ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!

10 Sep, 2020 17:28 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్‌ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా వాటిపై లేని చర్చ కంగనా, శివసేన వ్యవహారంపై విపరీతంగా నడుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యతో ప్రారంభమైన ఈ ప్రకంపనలు ఏకంగా కంగనా ముంబైలో నిర్మించుకున్న కార్యాలయాన్ని కూల్చేవరకు తీసుకెళ్లాయి. బాలీవుడ్‌లో నెపోటిజం మూలంగానే సుశాంత్‌ ఆ‍త్మహత్యకు పాల్పడాడంటూ తొలుత కామెంట్‌ చేసిన కంగనా.. ఆ తరువాత దేశ ఆర్థిక రాజధానిని పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోల్చుతూ వివాదంలోకి దిగారు. ఆమె వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం ఇరువర్గాల (కంగనా-శివసేన) మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే శివసేన నేతలు చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న నటి.. ఏకంగా కేంద్ర ప్రభుత్వం చేత వై కేటగిరి సెక్యూరిటీని సైతం  ఏర్పాటు చేసుకుని ముంబైలో అడుగుపెట్టింది. (కంగన ఆఫీస్‌ కూల్చివేత.. గవర్నర్‌ సీరియస్‌!)

ఆ సమావేశంలో ఏం జరిగింది..?
అయితే తమనే అవమానిస్తావా అంటూ కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహా ప్రభుత్వం కంగనా ముంబైలో అడుగుపెట్టే సమయానికి ఊహించని షాకే ఇచ్చింది. ఆమె నిర్మించుకున్న కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతగా సిద్ధమైంది. అయితే కంగనా కార్యాలయం కూల్చివేతపై ప్రభుత్వంలో ముందే పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున అక్రమ కట్టడాన్ని కూల్చివేయగా.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రైత్‌ మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కంగనా నిర్మాణాన్ని తొలగించి వివాదాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని శరద్‌ పవార్‌.. సీఎం ఠాక్రేతో వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంగనా వ్యవహారాన్ని వదిలేయాలని, చట్ట పరంగా ఏమైనా చర్యలు ఉంటే అది స్వతంత్ర హోదా కలిగిన బీఎంసీ అధికారులే చూసుకుంటారని చెప్పిన్నట్లు తెలిసింది. (శివసేన సర్కారు దూకుడు)

ప్రభుత్వ తీరుపై పవార్‌ తీవ్ర అసంతృప్తి..!
అయితే పవార్‌ వాదనతో ఏకీభవించని ఠాక్రే కంగనాను వదిలే ప్రసక్తే లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని తేల్చి చెప్పినట్లు ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిలో ప్రభుత్వం తప్పిందం ఏదైనా ఉంటే ప్రతిపక్ష బీజేపీకి మరింత అవకాశం దొరుకుతుందనీ కూడా పవార్‌ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంగనా-శివసేన ఎపిసోడ్‌లో ప్రభుత్వ తీరుపై పవార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకుంటోదని పలువరు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ఓ నటికి వై కేటగిరి భద్రత కల్పించడంపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కంగనా తొలి నుంచీ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దానిని దృష్టిలో ఉంచుకునే ఆమెకు భద్రత కల్పించారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బీజేపీ కంగనాకు మద్దతుగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆగుతుందా.. ముదురుతుందా
ఇదిలావుండగా కంగనా కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈనెల 22 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బీఏంసీ అధికారులను ఆశ్రయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగ‌నా కార్యాల‌యం కూల్చివేత ప‌నుల‌ను షురూ చేశారు. కూల్చివేత ప‌నుల‌ను స‌వాలు చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు స్టే ఇచ్చింది.  అనంతరం గురువారం మధ్యాహ్నాం తన కార్యాలయన్ని కంగనా పరిశీలించారు. అయితే ఈ వివాదం ఇప్పటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది వేచిచూడాలి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా