కాంగ్రెస్‌ టాలెంట్‌ హంట్‌.. యువ నేతలపై వల

17 Sep, 2021 06:42 IST|Sakshi
కన్హయ్య కుమార్‌ జిగ్నేష్‌ మేవాని

రాహుల్‌తో కన్హయ్య కుమార్‌ భేటీ

టచ్‌లో ఉన్న జిగ్నేష్‌ మేవాని

న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్‌ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువ తరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద, సుస్మితా దేవ్, ప్రియాంక చతుర్వేది వంటి యువనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల్లో తమకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్, గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని వంటి నాయకుల్ని కాంగ్రెస్‌ అక్కున చేర్చుకోవాలని చూస్తోంది.   

మోదీకి ఎదురొడ్డి..  
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదిరించి ప్రజల్లోకి బాగా దూసుకువెళ్లిన నాయకుల్లో కన్హయ్య కుమార్‌ ఒకరు. విద్యార్థి సంఘం నాయకుడిగా కేంద్రంపై ఆయన సంధించే ఒక్కో మాట తూటాలా పేలేది. ఆయన ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని నింపాయి.  2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్హయ్య కుమార్‌ బెగుసరాయ్‌ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గిరిరాజ్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి పెద్దగా వార్తల్లోకి రాని ఆయన వచ్చే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు.

లెఫ్ట్‌ పారీ్టలో ఉంటే రాజకీయ భవిష్యత్‌ ఉండదని అనుకుంటున్న కన్హయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాందీని మంగళవారం కన్హయ్య కుమార్‌ కలుసుకొని చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ కన్హయ్య కుమార్‌ ఎక్కడికి వెళ్లినా జనాన్ని ఆకర్షించే శక్తి ఉన్న నాయకుడు. ఆయన సభలకు యువత భారీగా తరలి వస్తుంది. అందుకే వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కన్హయ్య కుమార్‌ని ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు సమాచారం. బిహార్‌ ఎన్నికల నాటికి ఆయనను కాంగ్రెస్‌ పారీ్టలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

గుజరాత్‌లో నాయకత్వ సమస్య  
గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని సైతం కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో జిగ్నేష్‌ మేవాని పోటీ చేసిన వడ్గమ్‌ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని దింపకుండా ఆయన విజయానికి కాంగ్రెస్‌ పరోక్షంగా సహకరించింది. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్‌ మేవాని కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్, యువ నాయకుడు రాజీవ్‌ సతావ్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్‌ మేవాని పారీ్టలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు