ఫోన్ చేసినట్లు అమిత్ షా మీకు చెప్పారా?

23 Nov, 2021 18:55 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

సాక్షి, అమరావతి: సమగ్రమైన బిల్లు తీసుకురావాలనుకోవడం వెనకడుగు వేయడమతుందా? చంద్రబాబు ఇలాంటివి తప్పుడు ప్రచారం చేయడంలో దిట్ట అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము వికేంద్రీకరణపై వెనుకడుగు వేయలేదని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటే ఆయన ఖర్మని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని, సాంకేతిక సమస్యలను తొలగించి మళ్లీ వస్తామని అన్నారు.

అమిత్ షా ఫోన్ చేస్తే బిల్లు రద్దు చేశామనడం అవివేకమని మండిపడ్డారు. ఫోన్ చేసినట్లు అమిత్ షా వీళ్లకు చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివి ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. మండలి విషయంలోనూ తాము వేసింది వెనుకడుగు కాదని స్పష్టం చేశారు.

ఆ రోజు మండలిలో తమ బలాన్ని ఉపయోగించి ప్రతీ దాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు. అనేక బిల్లులు ఆపింది నిజం కాదా అని నిలదీశారు. అలా ఒక సభను దుర్వినియోగం చేయొచ్చా? అని ప్రశ్నించారు. అందుకే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం నుంచి స్పందన రాలేదని అన్నారు. మరో వైపు ఇప్పుడు ఆ శక్తుల బలం తగ్గిందని అందుకే మండలి కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాజధానిపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, కానీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు