ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం 

20 Jul, 2022 15:01 IST|Sakshi

ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల సంబరాలు

చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. 

బీఈడీ బీఎల్‌ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్‌ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్‌సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. 

​​​​​​​
ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్‌ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్‌ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్‌లీడర్‌ పల్లా రమణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్‌), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు