Karimnagar: టీఆర్‌ఎస్‌లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

15 Sep, 2022 17:21 IST|Sakshi

మంత్రి, మాజీ మేయర్‌ వర్గాల మధ్య కుదరని సఖ్యత

సోహన్‌సింగ్‌ ఆడియో లీకులతో మంత్రివర్గం ఫైర్‌

కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్‌ దంపతులకు షోకాజ్‌ నోటీస్‌

మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని డెడ్‌లైన్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: గులాబీ పార్టీలో అంతర్గతపోరుతో కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా పరిణామం చెందుతున్న క్రమంలో జిల్లాలో ఇంటిపోరు రచ్చకెక్కడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా రవీందర్‌సింగ్‌ అల్లుడు సోహన్‌సింగ్‌ మంత్రిపై చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోహన్‌ సింగ్‌ తీరును మంత్రి వర్గీయులతోపాటు జిల్లా పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కమల్‌జిత్‌కౌర్‌ దంపతులకు పార్టీ షోకాజ్‌ జారీ చేసింది. మూడురోజుల్లో సమాధానం చెప్పాలంటూ డెడ్‌లైన్‌ విధించింది. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే..! 
వాస్తవానికి ఈ విభేదాలు రాత్రికి రాత్రి మొదలవలేదు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వలేదని అలకబూనిన రవీందర్‌ సింగ్‌ తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారిపై మంత్రివర్గీయులు కేసులు పెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రవీందర్‌ సింగ్‌ ఆరోపించారు. పోలింగ్‌ రోజు సైతం రవీందర్‌సింగ్, ఆయన అన్న కూతురు కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్‌లు పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టపాసులు కాల్చారన్న అభియోగంపై రవీందర్‌ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. వెంటనే పార్టీలోకి పునరాగమనం చేశారు. రీ ఎంట్రీ తరువాత కూడా రవీందర్‌సింగ్, మంత్రి వర్గాల మధ్య విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. 

ఇటీవల కాలంలో కౌన్సిల్‌ సమావేశంలో నీటికొరతపై కమల్‌జిత్‌కౌర్‌ నిరసన తెలపడం, స్మార్ట్‌ సిటీ పనులపై రవీందర్‌సింగ్‌ ఆరోపణలతో మంత్రివర్గంతో అగాథం మరింత పెరిగింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్‌ భర్త సోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యల ఆడియో లీకవడం పార్టీలో చిచ్చురేపింది. మంత్రికి, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి నేతత్వంలో పలువురు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామక్రిష్ణారావుకు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అయితే.. సీఎం కేసీఆర్‌ ఉత్తరభారతదేశ పర్యటనల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మంత్రి వర్గం తమపై రాజకీయ దాడి చేస్తోందని రవీందర్‌సింగ్‌ వర్గం ఎదురుదాడికి దిగుతోంది. 

మూడురోజులే గడువు..! 
పార్టీ ప్రతిష్ట మసకబారేలా, మంత్రి కమలాకర్‌కు పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్‌ కమల్‌జిత్‌ కౌర్, ఆమెభర్త సోహన్‌సింగ్‌లకు పార్టీ అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు బుధవారం జారీ చేసిన షోకాజుల్లో స్పష్టం చేశారు. దీంతో మూడురోజుల అనంతరం ఈ దంపతులు ఏమని వివరణ ఇస్తారు? ఆ సమాధానంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతృప్తి చెందుతారా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. (క్లిక్ చేయండి: కరీంనగర్‌ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు)

మరిన్ని వార్తలు