Karimnagar Politics: కరీంనగర్‌ ‘కారు’లో ఏం జరుగుతోంది?

24 Sep, 2022 17:53 IST|Sakshi

అధికార పార్టీ అంటే గ్రూపులు తప్పవు. పదవుల పరుగు పందెంలో ఎవరికి వారు తామే ముందుండాలని అనుకుంటారు. కరీంనగర్ సిటీలో మంత్రికి, నగర మాజీ మేయర్‌ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. మధ్యలో మాజీ మేయర్ అల్లుడి వ్యవహారంతో రెండు గ్రూపుల మధ్య వైరం మరింత ముదిరింది. ఇంతకీ కరీంనగర్ కారుకు రిపేర్ జరుగుతుందా?

కరీంనగర్ సిటీ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్దిరోజులుగా తనరూటే సెపరేటు అంటూ సింగిల్‌గా వెళ్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై నగర టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మూకుమ్మడి యుద్ధానికి దిగారు. రవీందర్ కుటుంబ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రవీందర్ సింగ్ అల్లుడు ఓ వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును టీఆర్ఎస్ కార్పొ రేటర్లు బహిర్గతం చేశారు.

సింగ్ కుటుంబాన్ని పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని అధిష్టానాన్ని కోరారు. దీనిపై మంత్రి కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై  ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ దంపతులు సైతం స్పందించారు. ఉద్యమకాలం నుంచి తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. 

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అల్లుడు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఓ వ్యాపారితో మాట్లాడిన ఫోన్ సంబాషణను టీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌పై చేసిన వ్యాఖ్యల్ని డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, పలువురు కార్పొరేటర్లు ఖండించారు. తమ డివిజన్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, మంచినీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో కౌన్సిల్లో నిరసన తెలియచేస్తూనే, రాత్రికి రాత్రి జేసీబీతో రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు తవ్వి సమస్యను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మేయర్, ఆయన కుటుంబసభ్యులు పథకం ప్రకారం సమస్యలు సృష్టిస్తూ...వాటికి మంత్రి కారణమంటూ చెప్పడం వెనుక ఉన్న కుట్రలను ప్రజలు గ్రహించాలని కోరారు. పార్టీకి నష్టం చేకూర్చేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న రవీందర్ సింగ్, కార్పొరేటర్ కమల్ జిత కౌర్, ఆమె భర్త సోహన్ సింగ్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు కరీంనగర్ 40వ డివిజన్ మార్కెట్ ఏరియాలోని ఓ కల్వర్టు ధ్వంసం చేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వర్టు డ్రైనేజీని జెసిబితో ధ్వంసం చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ శాఖకు 2.5 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఫిర్యాదులో తెలిపారు.

ఆది నుంచీ తాము టీఆర్ఎస్‌లో ఉన్నామని తాము తప్పు చేసినట్టు నిరూపించాలని కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్త సొహాన్ సింగ్ సవాల్ విసిరారు. ఇప్పుడీ టాపిక్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ వెంట ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనపైన, ఆయన కుటుంబంపైనా చర్యలు ఉంటాయా? ఉండవా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

మరిన్ని వార్తలు