Karimnagar Politics: కరీంనగర్‌లో కారుకు షాక్‌! ఆశలు గల్లంతు.. గులాబీకి ‘సింగ్‌’ బైబై

26 Nov, 2021 15:03 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన రవీందర్‌ సింగ్‌

25వ తేదీతో లేఖ విడుదల

హుజూరాబాద్‌ ఉపఎన్నికతో పెరిగిన దూరం

కరీంనగర్‌ జిల్లా రాజకీయాల్లోకలకలం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ రాజకీయాల్లో కలకలం రేగింది. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రాజీనామాతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్సీ టికెట్‌ వస్తుందని, కనీసం సీఎం కేసీఆర్‌ నుంచి ఏదైనా హామీ వస్తుందని గురువారం సాయంత్రం వరకు ఎదురుచూసిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. వాస్తవానికి ఈ లేఖను ఆయన ముందే సిద్ధం చేసుకుని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయం రవీందర్‌సింగ్‌ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని సమాచారం.

మంత్రి గంగుల కమలాకర్‌ వర్గంతో ఆది నుంచి ఉన్న వివాదాలు కొంతకాలంగా తీవ్రమయ్యాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆయన అనుచరుడిగా ముద్రపడటంతో పార్టీ కొంతకాలంగా తనను దూరంగా ఉంచిందని పలువురి వద్ద రవీందర్‌ సింగ్‌ వాపోయారు. ఇదే క్రమంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. 14 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, తనకు టికెట్‌ వస్తుందని సింగ్‌ ఇంతకాలం ధీమాతోనే ఉన్నారు. 
(చదవండి: చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి.. )

సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం.. 
► నోటిఫికేషన్‌ వచ్చాక ఆయన సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
► గతవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయానికి సైతం వెళ్లారు. 
► ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలోనూ పార్టీ నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూశారు. 
► ఈలోపు ఎమ్మెల్సీగా ఇటీవల టీడీపీ నుంచి పార్టీలో చేరిన ఎల్‌.రమణకు టికెట్‌ ఇవ్వడంతో తనకు అన్ని దారులు మూసుకుపోయాయని భావించారు. 
► అధికార పార్టీ రెండు స్థానాల్లో ఏకగ్రీవం కాకూడదని, టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారు. 
► ఈ పరిణామం తరువాత కూడా పార్టీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖను గురువారం తేదీతో విడుదల చేశారు. దీంతో ఏకగ్రీవం కాకుండా తన ప్రణాళికను అమలుపరిచి ఎన్నికను అనివార్యం చేశారు. 
► మరోవైపు బుధవారం వేములవాడ కేంద్రంగా అసంతృప్త ఎంపీటీసీలతో రవీందర్‌సింగ్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. విపక్షాలు, అసంతృప్తుల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచే విషయంలో ఆయన దాదాపుగా సఫలీ కృతమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో తాను గెలుస్తానని రవీందర్‌ ధీమాగా ఉన్నారని సమాచారం. శుక్రవారం ఈ విషయంపై స్పష్టతరానుంది.

జిల్లా కేంద్రంపై చెరగని ముద్ర 
కరీంనగర్‌టౌన్‌: మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ కరీంనగర్‌ జిల్లా కేంద్రంపై చెరగని ముద్ర వేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువతో 1984లో ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా, న్యాయవాదిగా.. బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా.. 25 సంవత్సరాలుగా మున్సిపల్‌కు వివిధ డివిజన్ల నుంచి కౌన్సిలర్‌గా.. కార్పొరేటర్‌గా ఐదుసార్లు గెలుపొందారు. 
► ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న సభ్యులందరికంటే ఆయనే సీనియర్‌. 
► మొదట బీజేపీలో వివిధ విభాగాల్లో బాధ్యతలు చేపట్టి నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 
► 2007లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సింగ్‌ అనేక పార్టీ పదవులతోపాటు 2010 నుంచి నగర అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 
► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో నగర జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నికయ్యారు. 
► మాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందిన ఆయన.. మేయర్‌గా విభిన్న పథకాలకు రూపకల్పన చేసి కరీంనగర్‌ జిల్లా కేంద్రంపై చెరగని ముద్ర వేశారు. ఒకవిధంగా చెప్పాలంటే కరీంనగర్‌లో పురుడుపోసుకున్న పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యాయి. 
► ముఖ్యంగా నిరుపేదలకు ఒక్కరూపాయికే నల్లా.. ఒక్క రూపాయికే అంత్యక్రియలు.. పదో తరగతి విద్యార్థులకు సరస్వతీ ప్రసాదం, కాలేజీ విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్‌ వంటి పథకాలు కరీంనగర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాయి. 
► ఆయన మేయర్‌గా ఉన్న సమయంలో రాష్ట్ర మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్‌ల సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు. 
►  2016లో కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకోవడంలోనూ కీలక భూమిక పోషించారు. కరీంనగర్‌ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రయివేట్‌ సంఘాలకు, ప్రయివేట్‌ టీచర్‌ సంఘాలకు, క్రీడా సంఘాలకు, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సింగ్‌ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 
► అనేక సందర్భాలలో రవీందర్‌సింగ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ హామీ సైతం ఇచ్చారు. కానీ.. పలుమార్లు ఆశించినా రవీందర్‌సింగ్‌కు నిరాశే ఎదురైంది. 
►  తాజాగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 
(చదవండి: మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకొని చితకబాదారు)

మరిన్ని వార్తలు