Karnataka: ఎద్దులబండిలో అసెంబ్లీకి  

14 Sep, 2021 13:21 IST|Sakshi

సాక్షి, శివాజీనగర (కర్ణాటక): పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును ఖండిస్తూ సోమవారం ఎద్దుల బండిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు విధానసౌధకు ఊరేగింపుగా వచ్చారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలపై భారం వేస్తోందని దుయ్యబట్టారు. ఎద్దుల బండి పోరాటం ద్వారా ప్రజల్లో జాగృతి కల్పించామని తెలిపారు.  భారీ సందోహంతో రావడంతో సౌధ పరిసరాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వందలాది పోలీసులు మోహరించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. 

దివంగతులకు సంతాపం 
శాసనసభా వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం ఇటీవల గతించిన రాజకీయ, సామాజిక ప్రముఖులకు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాగానే సభాధ్యక్షుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు.   

అసంతృప్తి లేదు: యడ్డి 
బీజేపీ రాష్ట్రాధ్యక్షునితో కలిసి రాష్ట్రమంతటా పర్యటించనున్నట్లు మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా పని చేస్తానని, సంతోషంగానే ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేగా రావడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పక్కన సీట్లో కూర్చోవడానికి స్పీకర్‌ ఆమోదించారని తెలిపారు.  

స్వచ్ఛ గాలి ఎక్కడ ..  
స్వచ్ఛ గాలి పథకంతో బెంగళూరులో రూ.2.67 కోట్లను ఖర్చు చేశారు, స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉందో చూపించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కేసీ.కొండయ్య పరిషత్‌లో ప్రశ్నించారు. పరిసర మంత్రి ఆనంద్‌సింగ్‌ తరఫున పరిషత్‌ నేత కోటే శ్రీనివాసపూజారి సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ గాలి పథకాన్ని బెంగళూరు, దావణగెరె, హుబ్లీ, ధారవాడ, కలబురిగి నగరాల్లో చేపట్టిందన్నారు. 2019 నుంచి 2024 నాటికి గాలిలో ధూళి ప్రమాణాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడమే లక్ష్యమన్నారు. కాగా, చేతనైతే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలను తగ్గించాలని మంత్రి శ్రీరాములు ఆ పార్టీని సవాల్‌ చేశారు.  

చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం..

మరిన్ని వార్తలు