తాలిబన్ల వల్లే పెట్రోల్‌ ధర పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యే

4 Sep, 2021 18:46 IST|Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

బెంగళూరు: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం ప్రారంభం అయిన నాటి నుంచి మన దేశంలో వారి ప్రస్తావన బాగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకునే క్రమంలో నేతలను తాలిబన్లతో పోలుస్తూ.. తిడుతున్నారు. మరి కొందరు నాయకులు ఓ అడుగు ముందుకు వేసి.. దేశంలో ఇంధన ధరలు, వంట గ్యాస్‌ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే అని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. 

కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బల్లాడ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. ఫలితంగా ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చౌకగా పెట్రోల్‌ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్‌ వెళ్లండి: బీజేపీ నేత)

అరవింద్‌ వ్యాఖ్యలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్‌లో తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందేమో. కానీ దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్‌ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు జనాలు. (చదవండి: అఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్‌)

ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక రాయిటర్స్‌ ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి ఇరాక్‌, సౌదీ అరేబియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్‌కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అఫ్గనిస్తాన్‌ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే రాహుల్‌ గాంధీ ఇంధన ధరల పెంపు అంశంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు పెంచుతూ ఇప్పటికే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలు 44 శాతం, డీజిల్‌ ధరలు 55 శాతం పెరిగినట్లు రాహుల్‌ గాంధీ విమర్శించారు. 

చదవండి: అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం

మరిన్ని వార్తలు