Karnataka: రాజకీయాలకు బీజేపీ ఎంపీ గుడ్‌బై

7 Aug, 2021 09:37 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: చామరాజనగర బీజేపీ ఎంపీ వీ శ్రీనివాస ప్రసాద్‌ తన 75వ పుట్టిన రోజున రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. శుక్రవారం మైసూరులోని జయలక్ష్మపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 14 సార్లు ఎన్నికల్లో పోటీచేశానని, 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించానని అన్నారు. నాలుగేళ్ల క్రితమే రిటైర్‌ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నానని, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మరికొంత కాలం కొనసాగానని అన్నారు. అయితే, చామరాజనగర్‌ ఎంపీగా ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగనని స్పష్టం చేశారు.

కాగా 2017లో నంజన్‌గడ్‌ ఉప​ఎన్నికలో ఓడినపుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినా, 2019 లోక్‌సభ బరిలో దిగి విజయం సాధించిన శ్రీనివాస ప్రసాద్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ రంగంలో తన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాసిన పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘‘నిజాయితీ లేని వారికి, అవినీతిపరులకు చివరి గమ్యస్థానం రాజకీయాలే అని జార్జ్‌ బెర్నార్డ్‌ షా చెప్పినప్పటికీ.. రాజకీయ జీవితం అనేది సామాజిక సేవకై నిబద్ధతగా నిర్వర్తించే ఒక విధిగా నేనెలా భావించాను అన్న అంశాలను ఇందులో ప్రస్తావించాను’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు