రాజీనామాకు సీఎం సిద్ధం: చివరిసారి అందరికీ విందు

20 Jul, 2021 16:01 IST|Sakshi

బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి వీడుతారని చర్చ కొనసాగుతోంది. యడ్డి మార్పును సొంత పార్టీ నాయకులే కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. స్వయంగా నాయకులు మోదీ, అమిత్‌ షాతో సమావేశమై యడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా యడ్డికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. ఈ పోరు భరించలేక సీఎం పదవికి రాజీనామా చేసేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని సమాచారం. అందుకనుగుణంగా కర్ణాటకలో పరిణామాలు మారుతున్నాయి.

పదవి వీడేలోపు సొంత ప్రాంతం శివమొగ్గలో ముఖ్యమంత్రి హోదాలో భారీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు యడియూరప్ప కార్యాచరణ రూపొందించుకున్నారు. చివరిసారి సీఎం హోదాలో తన ప్రాంతం శివమొగ్గలో ఈనెల 23, 24వ తేదీల్లో పర్యటించేందుకు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారందరికీ భారీ స్థాయిలో ఈనెల 25వ తేదీన విందు ఏర్పాటు చేయాలని యడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం హోదాలో మళ్లీ సచివాలయానికి రాకపోవచ్చనే ఓ స్థిర నిర్ణయానికి యడ్డి వచ్చారు.

సచివాలయాన్ని వీడలేక విడిపోతున్న సందర్భంగా అందరికీ గుర్తుండేలా యడియూరప్ప ఈ మేరకు విందు నిర్వహించనున్నారట. గతవారం ఢిల్లీ పర్యటన చేపట్టగా అధిష్టానం ఆదేశాల మేరకు యడియూరప్ప పదవి వీడేందుకు సిద్ధమయ్యారని చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడ్డి బిజీబిజీగా మారారు. చివరి రోజుల్లో తన మార్క్‌ చూపించాలని వివిధ పనులు స్వయంగా పురమాయించుకుంటున్నారు. ఫొటో సెషన్‌ కూడా ఏర్పాటు చేశారంట.

అయితే 2023లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే యడియూరప్ప దిగిపోవాల్సిందేనని పార్టీ నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే యడ్డి సీఎం పదవి నుంచి దిగిపోనున్నారు. జూలై 26వ తేదీన యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు