Karnataka: కేబినెట్‌ హోదా వద్దన్న యడ్డీ

9 Aug, 2021 07:57 IST|Sakshi

బొమ్మై సర్కారులో శాఖల కలకలం

బుజ్జగించడమెలా?

యడియూరప్పతో సీఎం చర్చలు 

సాక్షి, బెంగళూరు: మంత్రి మండలి ఏర్పాటు, శాఖల పంపిణీ తరువాత అధికార బీజేపీలో భిన్నస్వరాలు పెరగడంతో సీఎం బసవరాజ బొమ్మై ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో చర్చించడానికి ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కావేరిబంగ్లాలో మాజీ సీఎం యడియూరప్పను కలిశారు. అర్ధగంటకు పైగా రహస్యంగా చర్చలు జరపడం కుతూహలానికి దారితీసింది. మంత్రులు ఆనంద్‌ సింగ్, ఎంటీబీ నాగరాజ్, వి.సోమణ్ణ. శశికకళా జొల్లె తదితరులు తమ శాఖలపై అలకలతో ఉన్నారు. పదవులు రాని పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇలా జరుగుతుందని ఊహించని బొమ్మై యడ్డిని కలిసి పరిష్కారానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.  

అలిగినవారిని బుజ్జగిస్తా: సీఎం  
శాఖల పంపిణీలో అసంతృప్తికి గురైన మంత్రులతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని సీఎం బొమ్మై తెలిపారు.  విధానసౌధ ముందు పునఃప్రతిష్టించిన నెహ్రూ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సీఎం ఎస్‌.నిజలింగప్ప వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తరువాత మాట్లాడుతూ కోరిన శాఖ లభించలేదని మంత్రి ఆనందసింగ్‌ తనను కలిసి మాట్లాడారన్నారు. రాబోయే రోజుల్లో ఆయన వినతికి గౌరవమిచ్చేలా చూస్తానని, అలాగే మంచి శాఖ లభించలేదని అసంతృప్తితో ఉన్న ఎంటీబీ నాగరాజ్‌ను కూడా పిలిపించి మాట్లాడుతానని తెలిపారు.  

కేబినెట్‌ హోదా వద్దన్న యడ్డి  
మాజీ సీఎం యడియూరప్ప తనకు కేబినెట్‌ హోదా వద్దని, దానిని రద్దు చేయాలని సీఎంకి లేఖ రాశారు. మంత్రులకు శాఖల కేటాయింపు సందర్భంగా యడ్డికి కేబినెట్‌ హోదాను ప్రకటించడం తెలిసిందే. దీనిపై యడ్డి ఆదివారం సీఎంకు లేఖ రాస్తూ మాజీ సీఎంగా నాకు వచ్చే వసతులను మాత్రమే ఇవ్వండి. కేబినెట్‌ హోదా అవసరం లేదు అని కోరారు.  

చదవండి: కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర

మరిన్ని వార్తలు