Basavaraj Bommai: కుర్చీలాట షురూ..

30 Jul, 2021 18:25 IST|Sakshi

బొమ్మై కేబినెట్లో బెర్తుల కోసం క్యూ

ఢిల్లీలో, యడ్డి నివాసంలో లాబీయింగ్‌   

సాక్షి, బెంగళూరు: కొత్త సీఎం ప్రమాణ స్వీకారంతో బీజేపీలో ఒక ఘట్టం ముగియగానే మరో ముఖ్య ఘట్టానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కేబినెట్‌లో పదవుల కోసం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలకు నాంది పలికారు. ఢిల్లీలోనూ మకాం వేసి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పాత కేబినెట్‌లో పది మందికి పైగా మంత్రులకు మొండిచేయి తప్పేలా లేదు. ఈసారి కొత్తవారికి అందులోనూ బీజేపీ మూలాలు ఉన్నవారికి మంత్రి పదవులు దక్కేలా ఉంది. యడియూరప్ప మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రులు అయిన కేఎస్‌ ఈశ్వరప్ప, సురేశ్‌ కుమార్, సీసీ పాటిల్, కోటా శ్రీనివాస పూజారి, శశికళా జొల్లె తదితరులకు చెక్‌ పడుతుందని సమాచారం.  

ఆ సీనియర్లకు భరోసా?.. 
గత కాంగ్రెస్‌– జేడీఎస్‌ల నుంచి వచ్చిన వలసదారుల్లో 15 మంది వరకూ యడియూరప్ప వద్ద మంత్రిగా ఉండేవారు. కొత్త మంత్రివర్గంలో 5–6 మందికి మాత్రమే మంత్రిభాగ్యం దక్కవచ్చని వినికిడి. సీనియర్‌ మంత్రులు, ఆర్‌.అశోక్, శ్రీరాములు, గోవింద కారజోళ, డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థ నారాయణ, లక్ష్మణ సవది, వి.సోమణ్ణ, మాధుస్వామి వంటి నేతల స్థానాలకు ఢోకా లేదని చెప్పుకుంటున్నారు. సభాపతి విశ్వేశ్వర హెగ్డే కాగేరికి చాన్సుంది.  

ఆదివారంలోగా నిర్ణయం  
ఆదివారంలోగా ఖరారు చేసి మంత్రిమండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కొత్త సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ కూర్పు మొత్తం బీజేపీ అధిష్టానం చేతుల్లో ఉంది. బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం మేరకే కేబినెట్‌ కూర్పు జరగనున్నట్లు తెలిసింది. యడియూరప్ప మాజీ సీఎం అయినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయనే పెద్దదిక్కుగా ఉన్నారు. ఆశావహులు యడియూరప్ప ఇంటికి పరుగులు పెడుతున్నారు. యడ్డి చెబితే మంత్రి పదవి వచ్చేస్తుందని ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్, అప్పుగౌడ పాటిల్, రేణుకాచార్య, మునేనకొప్ప, తిప్పారెడ్డి తదితరులు ఆయనను కలిసి చర్చించారు.  

మరిన్ని వార్తలు