కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు.. సీఎం పోస్టుకు రూ. 2,500 కోట్లు?

20 Aug, 2022 15:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ నాయకుడు హరిప్రసాద్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో ముఖ్యమంత్రి పోస్టు విలువ ఏకంగా రూ. 2,500 కోట్లు ధర పలుకుతున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడే చెప్పినట్లు అసెంబ్లీలో హరిప్రసాద్‌ అన్నారు.

బీజేపీ సీనియర్‌ నేత చెప్పిన దాని ప్రకారం.. సీఎం పదవికోసం అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ప్రమేయం ఉంది. సీఎం కుర్చీ కోసం రూ. 2,500 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ఆ బీజేపీ నాయకుడి పేరు మాత్రం ప్రతిపక్షనేత హరిప్రసాద్‌ ప్రస్తావించలేదు. 
చదవండి: ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్‌ వేటు

కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మారనున్నారని గత నెల రోజులుగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  బీజేపీ అధిష్టానం సీఎం పీఠంపై నుంచి బసవరాజ్‌ బైమ్మైను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని కూర్చొబెట్టనున్నారని ప్రచారం సాగింది. దీనికి తోడు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్‌లో సభ్యుడిగా చేర్చడంతో బీజేపీ అధిష్టానం బొమ్మైకు ఉద్వాసన పలుకనుందని తాజా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ రూమర్లను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తోసిపుచ్చారు. బొమ్మైను తొలగించే ప్రశ్నే లేదన్నారు. తన నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని. బొమ్మై తన పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని అన్నారు. అలాగే బొమ్మై నాయత్వంలోనే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు