సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ.. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదు

26 Aug, 2022 21:36 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసమర్థుడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన ఆర్‌ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఎన్నుకోలేదని ఆరోపించారు.

మైసూరులో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన లేవని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ మంత్రి మధుస్వామే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం 40శాతం కమీషన్‌ అడుగుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సమాఖ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై న్యాయ  విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.

మంత్రి మధుస్వామి టెలిఫోనిక్ సంభాషణ ఇటీవలే లీకైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఏదో తామే అలా నెట్టుకొట్టుస్తున్నామని ఆయన అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
చదవండి: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్‌

మరిన్ని వార్తలు