కర్ణాటక కేబినెట్: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

7 Aug, 2021 13:32 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి.  రాష్ట్ర నూతన  ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతను చేపట్టిన బొమ్మై   కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 29 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న బొమ్మై తన కేబినెట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేశారు.

ఆర్థిక శాఖతోపాటు, బెంగళూరు అభివృద్ధి, కేబినెట్ వ్యవహారాల కీలక శాఖలను కూడా సీఎం స్వయంగా నిర్వహించనున్నారు. ముఖ‍్యంగా ఆరగ జ్ఞానేంద్రకు హోం శాఖను, మొదటిసారి మంత్రి అయిన  నగేష్ కు ప్రాథమిక విద్యాశాఖను కేటాయించారు. ఇంకా సునీల్ కుమార్‌కు ఎనర్జీ అండ్‌ పవర్ పోర్ట్‌ఫోలియో ఇచ్చారు.

రవాణా, ఎస్‌టీ సంక్షేమ శాఖను బీ శ్రీరాములకు కేటాయించగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖను ఈశ్వరప్పకు, రెవిన్యూశాఖను ఆర్‌ అశోకాకు అప‍్పగించారు. గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల శాఖను లింగాయత్ నాయకుడు, వి.సోమన్నదక్కించుకున్నారు. మురుగేష్ నిరానీకి భారీ, మధ్యస్థాయి పరిశ్రమలశాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. అలాగే భువనేశ్వరి (కర్ణాటక దేవత) పేరుతో ప్రమాణం చేసిన ఆనంద్ సింగ్‌కు పర్యావరణ మరియు పర్యావరణ శాఖ, గోమాత పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభు చవాన్‌కు పశుపోషణ శాఖను కేటాయించడం విశేషం. కాగా యడ్యూరప్ప రాజీనామా తరువాత గత వారం బీజేపీ శాసనసభా పక్ష నూతన నాయకుడిగా ఎన్నికైన బొమ్మై జూలై 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు