రాజ్యసభ సీటు కోసం అలకబూనిన ‘సీఎం చంద్రూ’.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై!

30 May, 2022 10:26 IST|Sakshi

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్ణాటక సీనియర్‌ నేత హెచ్‌ఎన్‌ చంద్రశేఖర్‌ అలియాస్‌ ముఖ్యమంత్రి చంద్రూ, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌కు పంపాడు. 

కాంగ్రెస్‌కు ఉన్న చారిత్రక నేపథ్యం చూసి పార్టీలో చేరానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని ఆయన రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

హెచ్‌ ఎన్‌ చంద్రశేఖర్‌.. కన్నడ నటుడు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించారు. ఎక్కువగా ఆయన సీఎం పాత్ర పోషించడంతో ‘ముఖ్యమంత్రి చంద్రూ’గానే ఆయన పాపులర్‌ అయ్యాడు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. జనతా పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గౌరీబిదానర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1998 నుంచి 2004 దాకా ఎమ్మెల్సీగా కొనసాగారు. అటుపై 2013 వరకు కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2013లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీలో చేరారు.

HN Chandrashekar కర్ణాటక తరపున రాజ్యసభ సీటు ఆశించారు. అయితే నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రు అలకను కాంగ్రెస్‌ నేతలు కొందరు ధృవీకరించారు కూడా. అయితే ఆయన మాత్రం వ్యక్తిగత కారణం అని మాత్రమే చెబుతున్నారు.

మరిన్ని వార్తలు