1,744 కోట్ల ఆస్తి.. రహస్య వ్యాపారాలు లేవు

26 Nov, 2021 20:29 IST|Sakshi
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యూసుఫ్ షరీఫ్

చట్టబద్దంగా ఆస్తులు కూడబెట్టాను

సక్రమంగా పన్నులు కడుతున్నాను

బిలియనీర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కేజీఎఫ్‌ బాబు

బెంగళూరు: తన వ్యాపారాలన్నీ చట్టబద్ధమైనవని, తనకు ఎటువంటి రహస్య వ్యాపారాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు యూసుఫ్ షరీఫ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,744 కోట్ల ఆస్తులు ఉన్నట్టు నామినేషన్‌ డిక్లరేషన్‌లో వెల్లడించారు. పాత సామాను వ్యాపారంతో మొదలు పెట్టిన యూసుఫ్ షరీఫ్ అంచెలంచెలు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.  

తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే  3 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పిస్తానని షరీఫ్‌ హామీయిచ్చారు. ‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తున్నాను. నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తున్నాను. నా ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన డిక్లరేషన్‌లో పొందుపరిచాను. నా స్నేహితులు, నియోజకవర్గం, గ్రామం, బెంగళూరు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. మా 6 నియోజకవర్గాల్లోని 3 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించాలని అనుకుంటున్నాను’ అని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. (చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే)

కేజీఎఫ్‌ బాబు.. 
యూసుఫ్ షరీఫ్.. కర్ణాటకలో కేజీఎఫ్‌ బాబుగా పాపులరయ్యారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌) కేంద్రంగా చాలా కాలం పాటు పాత సామాను వ్యాపారం చేశారు. ఈ బిజినెస్‌ బాగా కలిసిరావడంతో ‘కేజీఎఫ్‌ బాబు’గా ఆయన ప్రసిద్ధి చెందారు. తర్వాత కాలంలో బెంగళూరు కేంద్రంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగుపెట్టి వేల కోట్లకు పడగెత్తారు. ‘కేజీఎఫ్‌ బాబు’కు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే మూడు లగ్జరీ కార్లు తన వద్ద ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. (చదవండి: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’)

మరిన్ని వార్తలు