Jagadish Shettar: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు..

17 Apr, 2023 11:10 IST|Sakshi
Karnataka Ex Cm Jagadish Shettar Joins Congress

బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని బీజేపీకి ఆదివారం రాజీనామా చేసిన ఆయన.. ఆ మరునాడే హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బెంగళూరులో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం చాలా ఏళ్లపాటు కృషి చేసిన తనకు.. ఈసారి టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించడం షాక్‌కు గురి చేసిందని జగదీశ్ శెట్టర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తాను కాంగ్రెస్‌లో చేరడం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారని తెలిపారు.

అలాగే తనను రాజీనామా చేయకుండా బీజేపీలో ఎవరూ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదని జగదీశ్ తెలిపారు. ఎలాంటి పదవి ఇస్తామని గానీ, పార్టీలో ఉండాలని గానీ ఏ స్థాయి నేత కూడా తనను సంప్రదించలేదని చెప్పారు.

కాగా.. కర్ణాటకలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న ఒకే విడతలో జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో ఈసారి కాంగ్రెస్‌దే విజయమని తేలింది.
చదవండి: రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు.. భద్రతా వైఫల్యంపై సిద్ధూ ఆందోళన

మరిన్ని వార్తలు