కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయాం 

29 Oct, 2023 04:11 IST|Sakshi

నారాయణఖేడ్‌లో కర్ణాటక రైతుల ర్యాలీ

అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

నారాయణఖేడ్‌: తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలు అమలు కావడం లేదంటూ కర్ణాటకకు చెందిన రైతులు శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ర్యాలీ నిర్వహించారు. తాము మోసపోయామని, మీరు మోసపోవద్దని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే.. వీరి ప్రదర్శనను కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కర్ణాటక ప్రాంతానికి చెందిన 60 మంది వరకు రైతులు మంగల్‌పేట్‌ నుంచి నారాయణఖేడ్‌ రాజీవ్‌చౌక్‌ వైపు ర్యాలీగా బయలు దేరారు. కొద్దిదూరం రాగానే కాంగ్రెస్‌ కార్యకర్తలు వారిని అడ్డుకుని ప్లకార్డులను లాక్కొని చించివేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం కర్ణాటక రైతులు రాజీవ్‌చౌక్‌ వరకు ప్రదర్శనగా వెళ్లారు.  

హామీల అమలు లేదు: కర్ణాటక రైతులు  
దేవరాజ్‌గౌడ్, పెనినగౌడ, సోంనాథ్, సంజీవ్‌కుమా ర్‌ టోల్లె అనే రైతులు విలేకరులతో మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హామీలు అమలు కావడం లేదని చెప్పారు. మహిళలకు రూ.2వేలు, 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి కేవలం ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఎనిమిది గంటల విద్యుత్‌ సరఫరా ఉండగా, ప్రస్తుతం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.  

వారు పెయిడ్‌ ఆర్టిస్టులు: కాంగ్రెస్‌  
కర్ణాటక నుంచి వచ్చినవారు రైతులు కాదని, బీఆర్‌ఎస్‌ పెయిడ్‌ ఆర్టిస్టులని పీసీసీ ఎస్టీసెల్‌ వైస్‌ చైర్మన్‌ భీంరావునాయక్, ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తదితరులు విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ఓట మి తప్పదనే భయంతో పెయిడ్‌ ఆర్టిస్టులను తెచ్చి తప్పుడు ప్రచారానికి తెరలేపారన్నారు. తమ వెంట వస్తే బీఆర్‌ఎస్‌ నాయకులను కర్ణాటక తీసుకెళ్లి పథకాల అమలు తీరును చూపిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు