జాతీయ జెండాకు అవమానం?: కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ నైట్‌ ధర్నా! ఈశ్వరప్పకు మద్ధతుగా సీఎం

18 Feb, 2022 15:33 IST|Sakshi

Karnataka Assembly showdown: బీజేపీ నేత అత్సుత్సాహ ప్రకటన.. కర్ణాటక నాట రాజకీయ చిచ్చును రగిల్చింది. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని బీజేపీ నేత, ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.ఎస్‌.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో.. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు ఈశ్వరప్ప అలాంటి వ్యాఖ్యలే చేయలేదని వెనకేసుకొచ్చారు కర్ణాటక సీఎం. ‘ఈశ్వరప్ప.. ఎర్రకోట జెండాపైనా కాషాయపు జెండా ఎగురుతుందని ఏనాడూ అనలేదు. అదంతా అబద్ధం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసన అర్థం పర్థం.. ఓ విలువంటూ లేనిది. కేవలం ఇగో, రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారు. 

కర్ణాటక అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి పరిణామాలెన్నడూ జరగలేదు. ఇది కనీసం ప్రజా సమస్య కూడా కాదు. గతంలో ప్రజల కోసం రాజకీయ పోరాటాలు సాగేవి. ఇప్పుడు వీళ్లు చేస్తోంది అర్థం పర్థం లేనిది. ప్రతిపక్షాలు వాళ్లు ఏం చేయాలో మరిచిపోయినట్లు ఉన్నారు’’ అంటూ సీఎం బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం మీడియాతో  మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.    

ఈశ్వరప్ప తప్పుకోవాల్సిందే!

సీఎం బసవరాజ్‌ బొమ్మై వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ స్పందించారు. ‘కాషాయపు జెండా వ్యాఖ్యలపై ఈశ్వరప్ప రాజీమానా చేయాల్సిందే. ఆయన్ని తొలగించేంత వరకు రాత్రింబవలు మా నిరసన కొనసాగుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోకపోతే.. కోర్టుకు వెళ్తాం. అసెంబ్లీని స్తంభింపజేస్తాం. జాతీయ జెండాను అవమానపర్చడమే బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకుంది. రాజ్యాంగం గురించి.. జాతీయ జెండా గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ జెండాను, స్వాతంత్ర్యాన్ని దేశానికి అందించింది. వాళ్లేమో(బీజేపీ) ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు’ అంటూ శివకుమార్‌ స్పందించారు.

ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను అవమానించేలా మాట్లాడిన ఈశ్వరప్ప.. దేశద్రోహం నేరానికి పాల్పడ్డారని, ఆయన్ని తక్షణమే కేబినెట్‌ నుంచి తప్పించి, దేశద్రోహం కేసు నమోదు చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు కాంగ్‌ ఎమ్మెల్యేలు విధానసభలో ధర్నా చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు విఘాతం కలుగుతోంది. అంతేకాదు.. 

ఈశ్వరప్పకు వ్యతిరేకంగా రాత్రంతా విధానసభలోనే ధర్నా చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు సూచించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి.  ఈ మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌ వసతి, భోజన ఏర్పాట్లను సిద్ధం చేయగా.. ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో ఉంటున్నారు.  మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా విధానపరిషత్‌లోనూ గందరగోళం నెలకొనటంతో సమావేశం వాయిదాపడుతోంది. దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ స్పీకర్‌, మాజీ సీఎం బి.ఎస్.యడ్యూరప్ప సహా పలువురు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగి కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా.. లాభం లేకుండా పోతోంది.

నేను దేశభక్తుడిని..: ఈశ్వరప్ప

నేనే తప్పు చేయలేదు. నేను దేశభక్తున్ని, నేనెందుకు రాజీనామా చేయాలి? అని మంత్రి కే.ఎస్‌.ఈశ్వరప్ప అంటున్నారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జాతీయ జెండాకు అవమానం చేసింది కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌ అని, ఆయనే రాజీనామా చేయాలన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండాను రాబోయే 300–500 సంవత్సరాల్లో ఎగురవేయవచ్చని చెప్పాను అంతే. జాతీయ జెండాను అవమానించలేదు. నా మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్‌ వారికి పని లేక అనవసరంగా వివాదాలు సృష్టించే పని చేస్తున్నారు అని పేర్కొన్నారు.  మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా పలుచోట్ల కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు