అప్పుడు సమర్థించి ఇప్పుడు విమర్శలా?

8 Aug, 2020 05:18 IST|Sakshi

కాంగ్రెస్‌ పాపాలను టీఆర్‌ఎస్‌ కడిగే ప్రయత్నం: కర్నె

సీఎం చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు..: గువ్వల

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపును మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందని, గతంలో నీటి తరలింపును సమర్థించిన వారే ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. శాసనసభలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుతో కలసి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. నీటి కేటాయింపుల్లో బ్రిజేశ్‌ కుమార్‌ కమిటీ కూడా ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం చేసిందని, కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రస్తుతం ఏపీని వదిలి కర్ణాటకపై పోరాడుతున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడిగే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు కర్నె వెల్లడించారు. 

రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు: గువ్వల 
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినందునే కాంగ్రెస్‌ నేతలు రాజకీయ ఉనికిని కోల్పోయారని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. కృష్ణా బేసిన్‌లో వాటాదారులు కాని వారు కూడా నీటి దోపిడీకి పాల్పడుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న వారు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు