అవును.. అప్పుడు పేదలు గట్కే తిన్నరు

28 Feb, 2023 04:15 IST|Sakshi

మంత్రి సింగిరెడ్డి వ్యాఖ్యలు దొరల స్క్రిప్టు 

చంద్రబాబు మాటలను సమర్థించిన కాసాని  

సాక్షి, హైదరాబాద్‌: ‘నాడు ఆకలి రాజ్యమేలింది. తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న గట్క, సజ్జలు, ఒట్టు వడ్లు, నల్లవడ్లు, మొక్కజొన్న గట్క తిని పేదలు బతికేవారు. మా ఊళ్లో మేం గట్క తిని, గంజి తాగేవాళ్లం. ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యంపోయింది’అని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యంలో కాసాని సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్‌రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని ఎద్దేవా చేశారు. 15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని, ఆ 15 రోజులలోనే కొన్ని వేలమంది ప్రజలు తిండికి అలమటించేవారని గుర్తుచేశారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ పేదలకు కడుపు నిండా తినే అవకాశం రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా ఇచ్చారని పునరుద్ఘాటించారు.

కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో ధమ్‌ బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్‌రెడ్డి చెప్పాలని, హైదరాబాద్‌లోని పాతబస్తీ హోటళ్లలో దొరికిన ధమ్‌ బిర్యానీ మహబూబ్‌నగర్‌లో దొరికిందా అని ప్రశ్నించారు. దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని పేర్కొన్నారు. పచ్చజొన్నలు తినడం కరెక్టు కాదా? ఎన్టీఆర్‌ రూ.2 కిలో బియ్యం ఇచ్చారా.. లేదా..? ఆహార భద్రత తెలుగుదేశం పార్టీ వచ్చాకే వచ్చిందనడం వాస్తవం కాదా? చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని ఆయన సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు