1990 Kashmir Pandits Issue: నాటి పరిస్థితులకు కారణం నేనే అని తేలితే ఉరి తీయండి!

22 Mar, 2022 14:30 IST|Sakshi
కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంలోని ఓ దృశ్యం

ది కశ్మీర్‌ ఫైల్స్‌ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. 

వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్షన్‌లో వచ్చిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్‌ పండిట్ల వలసలకు ఫరూఖ్‌ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన.

 

అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్‌ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్‌ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. 

‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఛీఫ్‌నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్‌ మహమ్మద్‌(ప్రస్తుత కేరళ గవర్నర్‌)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్‌ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..  ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.

చదవండి: కశ్మీర్‌ ఫైల్స్‌.. ది పొలిటికల్‌ హీట్‌!

మరిన్ని వార్తలు