మండలికి అడుగు.. కవిత స్పందన

12 Oct, 2020 12:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కల్వకుంట్ల కవితకు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కవితకు అభినందనలు తెలుపుతున్నారు. రీఎంట్రీ టూ యాక్టీవ్ పాలిటిక్స్‌ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయంపై అభ్యర్థి కవిత ఆనందం వ్యక్తం చేశారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి పార్టీ నేతలు, ప్రజలు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. కాగా సోమవారం వెల్లడైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాల్లో కవిత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈనెల 14న ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. (కేబినెట్‌లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!)

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కవితను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 728 ఓట్లు కవితకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీల నుంచి 192 ఓట్లు వచ్చాయి. అబద్ధపు మాటలు చెప్పి డూప్లికేట్ బాండు పేపర్లలో బీజేపీ నేతలు మోసం చేశారు.వారి అబద్దాలకు జవాబుగా కవితకు భారీ మెజార్టీ ఇచ్చారు.పార్టీ తరఫున అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు.న్యాయం మరోసారి గెలించింది. కాంగ్రెస్, బీజేపీల ఓట్లు కలిపినా డిపాజిట్ రాలేదు’ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ విజయంతో నిజామాబాద్‌, కామారెడ్డిలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచాలు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు