­Telangana: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ విస్తరణ!

22 Jan, 2023 04:42 IST|Sakshi

ప్రణాళికపై కేసీఆర్‌ బిజీ

ప్రగతిభవన్‌లో వివిధ రాష్ట్రాల నేతలతో కేసీఆర్‌ వరుస భేటీలు

పార్టీ విధివిధానాలపై వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు

మూడురోజులుగా రాష్ట్ర పర్యటనలో తమిళనాడు వీసీకే ఎమ్మెల్యేలు

బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నవారితో మంత్రుల భేటీలు 

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) తొలిసభను భారీగా నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయిలో పార్టీని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాల నేతలతో ప్రగతిభవన్‌ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. పార్టీ విధివిధానాల కోసం వివిధ రంగాలకు చెందిన 150 మంది నిపుణుల బృందం కసరత్తు చేస్తుండగా, వారితో జరుగుతున్న చర్చల్లో కేసీఆర్‌ బిజీగా ఉంటున్నారు.

మరోవైపు రాష్ట్రవార్షిక బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరగా, దానికి తుదిరూపు ఇవ్వడంపైనా కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. కాగా, ఇప్పటికే పార్టీ అనుబంధ రైతువిభాగం అధ్యక్షుడిగా పంజాబ్‌కు చెందిన గుర్నామ్‌ సింగ్, బీఆర్‌ఎస్‌ ఏపీ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ను నియమించారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతువిభాగాలను ప్రారంభిస్తామని గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసూ్తనే బీఆర్‌ఎస్‌ విస్తరణపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.

రాష్ట్రమంత్రులతో ఇతర రాష్ట్రాల నేతల భేటీ
బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న తమిళనాడు విడుతలై చిరుతైగల్‌ కచ్చి(వీసీకే) అధ్యక్షుడు, ఎంపీ తిరుమావలవన్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా వీసీకే శాసనసభాపక్షం నేతలు మూడురోజులుగా తెలంగాణలో పర్యటిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. దళితబంధు పథకం అధ్యయనం కోసం వీసీకే శాసనసభాపక్షం నేత సింతనై సెల్వన్, మరో ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ బాలాజీతోపాటు మరికొందరు నేతలు కరీంనగర్‌లో పర్యటిస్తున్నారు. హుజూరాబాద్‌ ప్రాంతంలో దళితబంధు పథకం అధ్యయనంతోపాటు శనివారం బోరబండ ఎస్సార్‌హిల్స్‌లోని దళిత్‌ స్టడీ సెంటర్‌ను కూడా వీసీకే బృందం సందర్శించింది.

ఈ నెల మొదటి వారంలో నాగాలాండ్‌ ఎన్‌సీపీ అధ్యక్షుడు సులుమ్‌ తుంగ్‌ లోథా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ కాగా, కొన్ని తమిళ సంఘాలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమై బీఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించాయి. బిహార్‌కు చెందిన కొందరు నేతలు ఇటీవల హోంమంత్రి మహమూద్‌ అలీని కలిసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌తో కలిసి ఇటీవల కేసీఆర్‌తో భేటీ కాగా, ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ కార్యదర్శి కైలాశ్‌ ముఖి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల వారితో భేటీ, సమన్వయం బాధ్యతలను కొందరు మంత్రులకు కేసీఆర్‌ అప్పగించారు. 

ఈశాన్య రాష్ట్రాల రాజకీయంపై అధ్యయనం
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్‌ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ విస్తరణ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్న కేసీఆర్‌ మూడు ఈశాన్యరాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి నేతృత్వంలోని బృందానికి బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. ఈ బృందం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితి, ఎన్నికల్లో జాతీయ, స్థానిక పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు తదితరాలపై కేసీఆర్‌కు నివేదికలు అందజేస్తుంది.   

మరిన్ని వార్తలు