భయపడాల్సింది ఏమీ లేదు: సీఎం కేసీఆర్‌

10 Mar, 2023 01:43 IST|Sakshi

కేంద్రం మరింత కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది 

ధైర్యంగా ఎదుర్కొందాం.. 

కవితకు ఈడీ నోటీసులపై కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ 

పెండింగ్‌ బిల్లులపై సుప్రీంకు వెళ్లేందుకు మంత్రివర్గం సమర్థన

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఏడాదిలో కేంద్రం మరింత కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గానికి సూచించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ముందుగా ఊహించినవేనని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్దామని, భయపడాల్సిన పనేమీ లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. కాగా నోటీసులు, వేధింపులు ఇక్కడితో ఆగవని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇప్పటికే పలువురిపై దాడులు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. బీజేపీ అరాచకాలను క్షేత్రస్థాయిలోనూ ఎండగట్టాలని, అందుకు సంబంధించి శుక్రవారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వివరంగా మాట్లాడుకుందామని సీఎం చెప్పినట్లు తెలిసింది.  

తదుపరి భేటీలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఖరారు! 
గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని కేబినెట్‌ సమర్ధించింది. మరోవైపు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే ఇంకా సమయం ఉన్నందున తదుపరి కేబినెట్‌ భేటీలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కేసీఆర్‌ వెల్లడించినట్లు సమాచారం.

ఎన్నికల ఏడాది కావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విమర్శలకు, ఆరోపణలకు తావివ్వకుండా మసలుకోవాలని, బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు