రాష్ట్రాలను సంప్రదించకుంటే చిక్కులే.. 

22 May, 2022 01:27 IST|Sakshi

జాతీయ విద్యా విధానంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్య 

కేంద్రం ఇష్టానికి విధానాలు రూపొందించి ప్రజలపై రుద్దవద్దని సూచన 

సీఎం కేజ్రీవాల్‌తో కలిసి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌ల సందర్శన 

ఢిల్లీ తరహా విద్యా విధానం దేశం అంతా రావాల్సి ఉందన్న కేసీఆర్‌ 

పాఠశాలల సందర్శనకు తెలంగాణ ఉపాధ్యాయులు, ప్రతినిధులను పంపిస్తామని వెల్లడి 

నేడు చండీగఢ్‌కు వెళ్లనున్న సీఎం

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్రం తీసుకొచ్చే జాతీయ విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే సమస్యలు తప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలనైనా చేయవచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలతో కలిసి విధానాలను రూపొందిస్తే ఎలాంటి అడ్డం కులుండవు. అలా కాకుండా కేంద్రమే నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దాలని అనుకోవద్దు’ అని సూచించారు. ఢిల్లీలో విద్యా వ్యవస్థ తీరు చాలా బాగుందని.. అలాంటి విధానం దేశవ్యాప్తంగా అవసరమని చెప్పారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. శనివారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి మోతీభాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యాభివృద్ధి ప్రణాళికపై రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను సీఎం కేసీఆర్‌ తిలకించారు. తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కాసేపు ముచ్చటించారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, స్కూల్‌ కరిక్యులమ్, ఇతర అంశాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. తర్వాత మహమ్మదీయ నగర్‌లోని మొహల్లా క్లినిక్‌ను కేసీఆర్‌ సందర్శించారు. అక్కడ రోగులకు అందే వైద్య సేవలను తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

ఈ విద్యా వ్యవస్థ బాగుంది 
ఢిల్లీలో విద్యా వ్యవస్థ తీరు చాలా బాగుందని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ‘‘మార్కులు, ఇతర ఆందోళనల నుంచి విద్యార్థులను దూరం చేసేలా ప్రాక్టికల్‌ విధానాలతో విద్యను నేర్పుతున్నారు. విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం బాగుంది. ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఎలన్‌ మస్క్‌ అవ్వాలని ఉందని కొందరు విద్యార్థులు చెప్పారు. వారి ఆలోచనా విధానం భేష్‌. ఇలాంటి కార్యచరణను ప్రభుత్వం చేపట్టడం మనదేశంలో ఎక్కడా జరగట్లేదు. ఈ విధానాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను అందిస్తాయి మన దేశానికి ఢిల్లీ తరహా విద్యా విధానం చాలా అవసరం.

తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తాం. రాష్ట్రం నుంచి త్వరలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారుల బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తాం’’అని కేసీఆర్‌ ప్రకటించారు. ఇక్కడి మొహల్లా క్లినిక్‌ల ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. ఐదారేళ్ల క్రితం మొహల్లా క్లినిక్‌ల గురించి తెలుసుకుని తెలంగాణ అధికారులను పంపి అధ్యయనం చేయించామని.. ఇదే తరహాలో హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం 350 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. 

నేడు చండీగఢ్‌కు కేసీఆర్‌.. 
సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర సాగుచట్టాల రద్దు ఉద్యమంలో మరణించిన 600 రైతు కుటుంబాలను పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేయనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌  సీఎం భగవంత్‌మాన్‌ కూడా హాజరవుతుండటంతో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.  

ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటేనే అభివృద్ధి 
సీఎం కేసీఆర్‌ పాఠశాలల సందర్శనకు రావడం మాకు గౌరవం. అన్ని విషయాలు తెలుసుకొనేందుకు అనేక ప్రశ్నలు అడుగుతూ ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూ ఈ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మేం తెలుసుకుంటాం. 
– ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  

మరిన్ని వార్తలు