CM KCR Visit Delhi: వారణాసిలో కేసీఆర్‌ ప్రచారం?

1 Mar, 2022 03:26 IST|Sakshi
ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సీఎం కేసీఆర్‌

ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం

నేడు కేజ్రీవాల్‌తో సమావేశం

మూడురోజులు రాజధానిలోనే.. 

బీజేపీయేతర సీఎంల భేటీపై చర్చలు

పలు పార్టీల నేతలు, నిపుణులతో వరుసగా భేటీలు

4న వారణాసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో క్రియా శీల పాత్ర పోషించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతో పాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. సోమవారం ప్రగతిభవన్‌లో వార్షిక బడ్జెట్‌పై సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత రాత్రి 7:45గం.కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో కేసీఆర్‌ హస్తినకు వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్, అదనపు డీజీ అనిల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌ 3రోజులు ఢిల్లీలో మకాం వేయనున్నారు. మంగళవారం కేజ్రీ వాల్‌తో సమావేశమవుతారు. తర్వాత పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనూ కేసీఆర్‌ వరుస భేటీలు జరుపుతారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, జాతీయ పార్టీల వైఫల్యాలు, ప్రజల ముందు పెట్టా ల్సిన ఎజెండా, కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ పార్టీలు.. సంస్థల భావసారూప్యత, ఏకతాటిపైకి రావడంలో ఉండే అవరోధాలు తదితర అంశాలపై ఈ భేటీల్లో కేసీఆర్‌ చర్చించే అవకాశముంది.

తెలంగాణ భవన్‌ పనుల పరిశీలన..
ఫిబ్రవరి 20న ముంబై వెళ్లిన కేసీఆర్‌.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లేదా మరోచోట బీజేపీయేతర సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ కానున్న ముఖ్యమంత్రి.. సీఎంల సమావేశం నిర్వహణ తేదీ, ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చించే అవకాశముంది. కాగా ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ పనులను కూడా కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే చక్రం తిప్పే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

యూపీ వెళ్లే చాన్స్‌
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి. వీరితో పాటు కేసీఆర్‌ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే వీరితో కలిసి వెళతారా? విడిగా వెళతారా? అనేది తెలియరాలేదు.  

మరిన్ని వార్తలు