బీజేపీ- జనసేనల దోబూచులాట కీలక దశకు చేరుకుందా?

23 Mar, 2023 19:15 IST|Sakshi

ఆంద్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య దోబూచులాట కీలక దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇంతకాలం బీజేపీ నేతలు జనసేనకు వ్యతిరేకంగా బహిరంగంగా  వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడేవారు. అలాంటిది పార్టీ సమావేశం తర్వాత అదికారికంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ గా గత సారి ఎన్నికై, ఈసారి ఓటమి చెందిన మాధవ్ చేసిన ప్రకటనను గమనిస్తే బీజేపీకి జనసేన ఏమాత్రం సహకరించడం లేదని స్పష్టంగానే చెప్పిపట్లు అవగతం అవుతుంది.అదేదే సినిమా టైటిల్ మాదిరి వీరిద్దరి మధ్యలో తెలుగుదేశం పార్టీ చొరబడుతోంది. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేనను విడదీయడానికి, లేదా రహస్యంగా కాపురం చేయడానికి టీడీపీ అధినాయకత్వం లవ్ లెటర్లు పంపింది. ఆ వల అనండి,, ప్రలోభం అనండి... ఏదైనాకానివ్వండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి దాదాపుగా లొంగిపోయారన్న భావన ప్రజలలో ఏర్పడింది.

అప్పుడే వెన్నుపోటు రాజకీయాలా పవన్‌?
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎన్నికలలో తాము పలుమార్లు కోరినా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తమకు మద్దతు ప్రకటన చేయలేదని మాదవ్ చెప్పారు. తమ మద్య పొత్తు ఉన్నా,లేనట్లే అని ఆయన తెలిపారు. అంటే ఇంకా విడాకులు తీసుకోలేదు కానీ, తమ పార్టనర్ తమతో ఉండడం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా రహస్యంగా ఏమీలేరనే చెప్పాలి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వైసీపీని ఓడించండని పిలుపు ఇచ్చారే తప్ప, మిత్రపక్షమైన బీజేపీని గెలిపించండని కోరలేదు. ఇది వెన్నుపోటు అని బీజేపీ నేతలు బాధపడుతుండవచ్చు.

కానీ టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో స్నేహం కుదిరాక ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు ఆశ్చర్యం కలిగిస్తాయా అని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో దాదాపు అచ్చం చంద్రబాబు మాదిరే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారన్న అబిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆయన ఎవరినైనా వెన్నుపోటో లేక ఎదురుపోటో పొడవడానికి వెరవరన్న భావన రాజకీయవర్గాలలో ఉంది. రాజకీయంగా అది ఆయనకు బాగా కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నా, ఆయనకు ఇంకా అందులోని ఆనుపానులను పట్టుకోలేకపోయారు.

ఆటలో అరటి పండు మాదిరిగా..
అందువల్లే ఆయన ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చే ఆటలో అరటి పండు మాదిరి మిగిలిపోయారు. పవన్ కళ్యాణ్ తొలుత తన సోదరుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడుగా పనిచేశారు. కానీఆ తర్వాత కాలంలో తన సోదరుడితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విబేదించారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నప్పుడు ఈయన అభ్యంతరం చెప్పినట్లు వార్తలు రాలేదు. కానీసోదరుడితో పాటు ఈయన రాజకీయంగా నడచుకోలేదు. అన్నకు అండగా లేకపోవడాన్ని ఏమని అనవచ్చన్నది వేరే విషయం. తదుపరి ఆయన తనను తాను చెగువేరా అభిమానిగా పరిచయం చేసుకునేవారు. చెగువేరా బొమ్మ ను ఇంటిలో సైతం పెట్టుకున్నారు. చిత్రంగా తదుపరి చెగువేరా సిద్దాంతానికి పూర్తి విరుద్దంగా ఉండే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు.

అంతేకాదు.. బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమి కట్టి జనసేన తరపున ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. తద్వారా జనసేన కార్యకర్తలు,నేతలను ఆయన గాలికి వదిలివేశారు. అయినా అప్పట్లో ఆయన పార్టీవారు పెద్దగా తప్పు పట్టలేదు.ఆ తర్వాత కాలంలో ఆయా సందర్భాలలో బీజేపీ వైఖరిని తప్పు పట్టారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్లు ఇచ్చిందని ఆరోపించేవారు. మరికొన్నాళ్లకు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ తీవ్రంగా విమర్శించేవారు. వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసేవారు. అమరావతి రాజధాని కేవలం ఒక కులానికే చెందిందన్నంతవరకు ఆయన ఆరోపించారు.

చంద్రబాబును కలిశాక ఆ ఊసే మర్చిపోయారు..
అమరావతి లో బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు ఆయన మద్దతు ఇచ్చారు. కానీఆ తర్వాత చంద్రబాబును కలిశాక ఆ ఊసే మర్చిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీలను వదలి చెప్పాపెట్టకుండా బిఎస్పి, వామపక్షాలతో కూటమి కట్టారు. కానీఅదే టైమ్ లో రహస్యంగా చంద్రబాబుతో స్నేహం నడిపారు. ఆయన సూచించిన అభ్యర్ధులకే పవన్ టిక్కెట్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అంటే సొంత పార్టీకి, తాను జట్టు కట్టిన కూటమికే ఆయన ఎసరు పెట్టారన్నమాట. ఎన్నికలో తాను పోటీచేసిన భీమవరం, గాజువాకలలో చంద్రబాబు ప్రచారం చేయకుండా, అలాగే చంద్రబాబు , లోకేష్ లు పోటీచేసిన కుప్పం, మంగళగిరిలలో తాను ప్రచారం చేయకుండా రహస్య అవగాహన పెట్టుకున్నారు.

దీనిని వెన్నుపోటు రాజకీయం అంటారో?లేక మరేమంటారో కాని, తత్పఫలితంగా తాను ఓడిపోవడమేకాకుండా, తన పార్టీ మొత్తం బ్రష్టుపట్టిపోయింది. ఎన్నికలు అయిపోగానే వామపక్షాలు, బిఎస్పికి గుడ్ బై చెప్పి , డిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి మరీ ఆ పార్టీతో జతకట్టారు. ఆ పార్టీ పెద్దలు ఏమి చెబితే అది చేస్తానని ప్రకటించేవారు. ఆయన మాటలు నమ్మి బీజేపీ పెద్ద నాయకులు కొందరు తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ది పవన్ కళ్యాణ్ అని ప్రకటించారు.అయినా పవన్ కళ్యాణ్ దానిని సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. అలా అని వారిని పూర్తిగా వదలలేదు. వారితో కాపురం చేస్తున్నట్లుగానే నటిస్తూ, తెలుగుదేశంతో రహస్య సంబందాలు పెట్టుకున్నారు. తద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడానికి సన్నద్దమయ్యారు. ఇప్పుడు ఆ దశ వచ్చింది.

వేరే పార్టీ రూట్‌ మ్యాప్‌ ఇస్తే పని చేస్తానని చెప్పడం వండర్‌
తనకు బీజేపీ రూట్ మ్యాప్‌ ఇవ్వలేదని పైకి చెబుతున్నా, అసలు విషయం వేరన్న సంగతి బహిరంగ రహస్యమే. వేరే పార్టీ రూట్ మాప్ ఇస్తే తాను పనిచేస్తానని చెప్పడమే రాజకీయాలలో ఒక వండర్. బహుశా పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు అలా చేసి ఉండరు. పోనీ అందుకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం కూడా లేదు. ప్రదాని మోడీ స్వయంగా పిలిచి బీజేపీని వదలిపెట్టవద్దని చెప్పారు. దాని గురించి ఆయన ప్రస్తావించడం లేదు. అది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అంటారు. తద్వారా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎట్లా అన్నదానిపైనే ఆయన దృష్టిపెట్టారు తప్ప జనసేన ఎలా అదికారంలోకి వస్తుందన్నదానిపై ఆయన ఆలోచన పెట్టలేదని తేల్చేశారు.

టీడీపీతో కలిస్తే అదికారం వస్తుందేమోనన్న ఆశ. ముఖ్యమంత్రి పదవి కొంతకాలం అయినా దక్కుతుందేమోనన్న ఆకాంక్ష. మరో వైపు ముఖ్యమంత్రి పదవి రాకపోయినా ఫర్వాలేదు...తాను ఎమ్మెల్యేగా అయినా గెలిస్తే చాలన్న భావన..మధ్యలో తనను సినీ గ్లామరో ,లేక మరోకారణంతోనో అభిమానించే కార్యకర్తలు తమ ఆత్మాభిమానం సంగతేమిటన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు, టీడీపీవారు జనసేనను అవమానిస్తున్నారని , సీనియర్ నేత హరిరామజోగయ్య ,మరికొందరు చెప్పినప్పుడు ఆత్మాభిమానానికి దెబ్బ రానివ్వనని పైకి చెబుతారు. కానీఆ వెంటనే బహిరంగ సభలో తాము టీడీపీతోనే కలిసి పోటీచేస్తామన్న సంకేతం.. వైసీపీవారు కోరుకున్నట్లు జరగదు.. అంటూ వ్యాఖ్యలు.. ఇవన్ని ఆయనలో స్పష్టత లేకపోవడం వల్ల మాట్లాడుతున్నారో , లేక రాజకీయ అత్యాశతో చెబుతున్నారో అర్ధం కాదు.

అప్పుడు బీజేపీని తిట్టి వామపక్షాలతో జట్టు
ఈ చరిత్ర అంతా చూస్తే అచ్చం చంద్రబాబు మాదిరి రాజకీయం చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు కూడా తొలుత కాంగ్రెస్ లో మంత్రి. ఆ పార్టీ పక్షాన ఓటమి చెందాక, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తన మామ ఎన్.టి.రామారావు చెంత చేరారు. తదుపరి తనకంటూ ఒక సొంత గ్రూపును పార్టీలో ఏర్పాటు చేసుకున్నారు. చివరికి ఎన్.టి.రామారావునే ఎదురుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని ప్రచారం చేసి వామపక్షాలతో జట్టుకట్టారు. 1998లో కూడా అలాగే చేసి , ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పాపెట్టకుండా బీజేపీ కూటమిలోకి దూకేశారు.

తద్వారా 1999 శాసనసభ ఎన్నికలలో బాగా లబ్ది పొందారు. 2004 ఎన్నికలలో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీతో జీవితంలో జతకట్టనని అన్నారు. ఆ టైమ్ లో తమ పార్టీ విధానం సమైక్య ఆంద్రప్రదేశ్ అని చెప్పారు. 2008 నాటికి ఎపి విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చారు. తీరా కేంద్రం ప్రకటించాక ,దానిని ఆయనే విబేధించారు. మళ్లీ కేంద్రం అభిప్రాయం చెప్పమంటే తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇచ్చారు. ఈసారి కేంద్రం గట్టిగా నిలబడి తెలంగాణ ఇచ్చేశాక, సోనియాగాంధీపై నానా దూషణలకు దిగారు. 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. 2014కల్లా మళ్లీ మోడీని బతిమలాడుకుని బీజేపీ తో చెలిమి కుదుర్చుకున్నారు.

2018 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ , సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఎపి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు హాండిచ్చేశారు. 2019 ఎన్నికలకు ముందు మోడీని నానా మాటలు అన్నారు. ఎన్నికలలో ఓడిపోయాక మోడీని ఒక్క మాట అనకుండా జాగ్రత్తపడడమే కాదు..మోడీని పొగడడం కూడా ఆరంభించారు. తిరిగి జనసేన, బీజేపీలతో జతకట్టాలని యత్నిస్తూనే, ఎమ్మెల్సీ ఎన్నికలలో కమ్యూనిస్టులతో అవగాహన కుదుర్చున్నారు. ఈ మొత్తం అనైతిక రాజకీయ ప్రకియలో చంద్రబాబు చాలావరకు సఫలం అయినా, పవన్ కళ్యాణ్ మాత్రం సఫలం కాలేకపోతున్నారు.అయినా పవన్ కళ్యాణ్ చూపు అనైతిక రాజకీయాల వైపే ఉండడం ఆయనలోని  నిస్సహాయతను,డొల్లతనాన్ని తెలియచేస్తుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు