'దక్షిణాదిన కేసీఆర్‌.. ఉత్తరాదిలో కేజ్రీవాల్‌.. చీల్చే పని వీళ్లదే..'

21 Jan, 2023 08:27 IST|Sakshi

విపక్షాలు కలవకుండా చూసే బాధ్యతను వారికి అప్పగించిన బీజేపీ 

ఎంఐఎం బీజేపీకి బీ టీమ్‌.. సెక్యులర్‌ ఓట్లను చీల్చేపనిలో ఆ పార్టీ బిజీ 

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, కేజ్రీవాల్‌ కలిసి కాంగ్రెస్‌ పార్టీని నష్టపరిచే చర్యలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ వ్యాఖ్యానించారు. ‘దేశంలోని మెజార్టీ విపక్షాలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ, అవి ఏకం కాకుండా బీజేపీ రాజకీయం చేస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాదిన కేజ్రీవాల్‌కు, దక్షిణాదిన కేసీఆర్‌కు బాధ్యతలు అప్పగించింది. విపక్షాలు కాంగ్రెస్‌ వైపు రాకుండా చీల్చే పనిని ఆ ఇద్దరు తీసుకున్నారు’అని ఆయన ఆరోపించారు.

శుక్రవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావెద్, పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, కమలాకర్‌రావు, షబ్బీర్‌అలీతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఖమ్మం సభ కూడా అందులో భాగమేనన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ లేకుండా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్‌ పార్టీ కలిసే అవకాశాలు లేవని, ఆ పార్టీ బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని సెక్యులర్‌ ఓట్లను చీల్చి కాంగ్రెస్‌ పార్టీని ఓడించడం ద్వారా బీజేపీకి లబ్ధి కలిగించే పనిలో ఆ పార్టీ ఉందన్నారు.  

నాడు వాజ్‌పేయే చెప్పారు 
గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణలకు మోదీయే బాధ్యుడని తాజాగా వచ్చిన బీబీసీ వార్తలపై తారిఖ్‌ అన్వర్‌ స్పందిస్తూ ఆ వార్తలు వాస్తవమేనని అన్నారు. ఈ విషయంలో మోదీ రాజధర్మాన్ని నిర్వర్తించలేదని నాటి బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా వ్యాఖ్యానించారన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రూ.10 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఇస్తే ఎనిమిదేళ్ల పాలన తర్వాత సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చారని తారిఖ్‌ విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనేది ఆ కుటుంబమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను సీనియర్‌ నేత మాణిక్‌రావ్‌ ఠాక్రేకు అధిష్టానం అప్పగించిందని, ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని తారిఖ్‌ ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: పాదయాత్రకు రేవంత్‌ సన్నాహాలు! ఓకే అయితే జూన్‌ 2 వరకు

>
మరిన్ని వార్తలు