హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ ఖాయం

16 Jul, 2022 01:43 IST|Sakshi

మీడియాతో ముఖాముఖిలో మంత్రి కేటీఆర్‌ 

‘తెలంగాణలో ఎనిమిదేళ్లు ప్రభుత్వం నడిపిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల సర్వేల్లో తేలింది. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం కావడం ఖాయం. దక్షిణ భారతదేశపు తొలి హ్యాట్రిక్‌ సీఎంగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. దక్షిణాదిలో ఇప్పటివరకు కరుణానిధి, జయలలిత, చంద్రబాబు నాయుడు వంటి వారికి సైతం ఈ ఘనత దక్కలేదు..’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నందినగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో ముఖాముఖిగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
– సాక్షి, హైదరాబాద్‌

2023 డిసెంబర్‌లోనే ఎన్నికలు
ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తా­యని మా సర్వేలు పేర్కొంటున్నాయి. ఇకపై మరిం­త పరాక్రమ శైలితో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు. 119 అసెంబ్లీ నియో­జకవర్గాల్లో బలమైన నాయకులకే టికెట్లు ఇస్తాం. టీఆర్‌ఎస్‌ నుంచి కొందరు బయటకు వెళ్లొచ్చు.. మరికొందరు టీఆర్‌ఎస్‌­లోకి రావొచ్చు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీని­వా రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు (అసంతృప్త నేతలు)తో నేను స్వయంగా మాట్లాడి నచ్చజెప్పా. 

టీఆర్‌ఎస్‌ ఒక్కటే రాష్ట్రమంతా ఉంది..
తెలంగాణలో ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమే రాష్ట్రమంతటా ఉంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి, సిద్దిపేట వంటి చోట్లలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు. ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ నుంచి మాకు రెగ్యులర్‌గా ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది. 

కేసీఆర్‌ బెదరడు..లొంగడు
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతాం..చీల్చుతాం అని బీజేపీ నేతలు చెప్పడం వారి అహంకారానికి నిదర్శనం. కేసీఆర్‌ ఎవరికీ బెదరడు, లొంగడు. ఎన్నికల తేదీ­లను ప్రకటిస్తే అసెంబ్లీని రద్దు చేసేందుకు సిద్ధం. 

దేశంపై ఏకత్వం రుద్దడం సరికాదు..
జర్నలిస్టు, ఫ్యాక్ట్‌ చెకర్‌ జుబేర్‌ను అరెస్టు చేసి ఒకచోట నుంచి ఇంకో చోటుకు బీజేపీ ప్రభుత్వాలు తిప్పుతుంటే జర్నలిస్టులు మౌనంగా ఉండడం సరికాదు. భిన్నత్వంలో ఏకత్వం గల దేశంపై ఏకత్వాన్ని రుద్దడం సరికాదు.

ఈటలను తిరిగి తీసుకోవడం ఊహాజనితమే..
ఈటల రాజేందర్‌కు బీజేపీలో ప్రాధాన్యత లేదు. ఆయన తిరిగివస్తే టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ ఊహాజనితమే. సీఎం కేసీఆర్‌ కుమారుడిని కాబట్టే నాకు మీడియాలో అధిక ప్రాధాన్యంలభిస్తోంది. ఇతర మంత్రుల శ్రమను మీడియా గుర్తించడం లేదు. 

కాంగ్రెస్‌ పనైపోయింది..  
రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పనైపోయింది. గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదు. వైఎస్సార్‌టీపీకి కూడా తిరస్కరణ తప్పదు. 

త్వరలో కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు
కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాం. ధరణి సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం, వరదల్లో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునగడం పెద్ద విషయాలేమీ కాదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టంలో కటాఫ్‌ తేదీని సవరిస్తూ కేంద్రం చట్టసవరణ చేస్తే గిరిజనులకు పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.  

రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం
శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు అప్పుల విషయంలో రాష్ట్రంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రధానికి మానవత్వముంటే వరదలు వచ్చినందుకు రాష్ట్రానికి ముందస్తుగా విపత్తుల సహాయ నిధి విడుదల చేసేవారు. హైదరాబాద్‌కు వరదలొస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదే గుజరాత్‌కు రూ.1,000 కోట్లను అడ్వాన్స్‌గా ఇచ్చారు. మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధానమంత్రి. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి వెళితే, తిరిగి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే వస్తున్నాయి. ఇది తప్పని రుజువు చేస్తే రాజీనామా చేయడానికి సిద్ధం.  

మరిన్ని వార్తలు