ఆప్‌ ఆఫీసులో సోదాలు.. కేంద్రంపై కేజ్రీవాల్‌ ఫైర్‌!

13 Sep, 2022 02:53 IST|Sakshi

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో పోలీసులు అక్రమంగా సోదాలు జరిపారని ఆప్‌ ఆరోపించింది. అలాంటిదేమీ లేదని పోలీసులు ఖండించగా, సోదాలు చేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది. దీనిపై తమ ప్రశ్నలకు బదులిచ్చేందుకు సీఎం భూపేంద్ర పటేల్‌ సిద్ధమా అని ప్రశ్నించింది. ‘‘రెండు రోజుల పర్యటన కోసం ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం చేరుకున్న కాసేపటికే పోలీసులు అహ్మదాబాద్‌లోని మా పార్టీ ఆఫీసులోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించారు. ఎలాంటి వారెంట్‌ లేకుండానే రెండు గంటలపాటు సోదాలు జరిపారు. డబ్బు, ఇతర అక్రమ లావాదేవీల పత్రాలు లభించకపోయేసరికి మళ్లీ వస్తామంటూ సిబ్బందిని బెదిరించి వెళ్లారు’’ అని ఆప్‌ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. బహిరంగ చర్చకు సీఎం సిద్ధమైతే సోదాలు చేపట్టిన అధికారుల వివరాలను కూడా అందజేస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో కేజ్రీవాల్‌ ప్రజాదరణ చూసి బీజేపీలో ఆందోళన మొదలైంది. అందుకే ఇలా పోలీసుల ద్వారా మా ఆఫీసులో సోదాలకు తెగబడింది’’ అని ఆరోపించారు. అయితే గుజరాత్‌ పోలీసులు ఆప్‌ వీటిని ఖండించారు. ఆప్‌ కార్యాలయంలో తాము ఏ  సోదాలూ జరపలేదంటూ ట్వీట్‌ చేశారు. 

వసూళ్ల కోసమే సోదాలు: కేజ్రీవాల్‌ 
దర్యాప్తు సంస్థలను అవినీతిని రూపుమాపేందుకు బదులుగా అక్రమ దందా కోసమే వాడుకుంటోందని కేంద్రంపై ఆప్‌ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్‌ కార్యాలయంలో సోదాల సమయంలో తమ పార్టీ శ్రేణులను పోలీసులు డబ్బులు అడిగారన్నారు. ఏమీ దొరక్కపోయేసరికి ఎలాంటి సోదాలు జరపలేదంటూ పోలీసులు చెప్పుకోవడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. ‘ఈ దేశంలో ఏం జరుగుతోంది? పోలీస్‌ సర్కార్‌ ఇలాగే పనిచేస్తుందా? ఎలాంటి పత్రాలు లేకుండానే పోలీసులు ఇళ్లు, ఆఫీసుల్లోకి చొరబడతారా?’అని సోమవారం అహ్మదాబాద్‌ టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. బడా వ్యాపారవేత్తల నుంచి దేశానికి విముక్తి కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: సీఎంను డిన్నర్‌కు ఆహ్వానించిన ఆటోవాలా  

మరిన్ని వార్తలు