ఐదేళ్లు.. 150 కోట్లకి పైగా ఖర్చు.. హడావిడి ప్రారంభం

1 Aug, 2021 12:59 IST|Sakshi

Kuthiran Tunnel: ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ప్రాజెక్టు లాంఛింగ్‌ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కనీస సమాచారం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేరళ కుథిరన్‌ టన్నెల్‌.. ఎన్‌హెచ్‌ 544పై మన్నూథి-వడక్కన్‌చెరి మధ్య కేరళ సర్కార్‌ నిర్మించిన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌(సొరంగ మార్గాలు). శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే తెరుచుకోవడం అక్కడి మంత్రులు, అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.

తిరువనంతపురం: కుథిరన్‌(త్రిస్సూర్‌) వద్ద కేరళ-తమిళనాడు, కర్ణాటక జాతీయ రహదారులను కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చేది. అంతేకాదు ఇరుకు రహదారి, ప్రమాదకరమైన మలుపులతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో ఆరు లైన్ల రోడ్డుకి అనుసంధానిస్తూ.. పీచీ-వలహని వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ వద్ద కొండల్ని తొలగించి సుమారు 964 మీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఈ సొరంగం వల్ల కొచ్చి-కొయంబత్తూర్‌ల మధ్య దూరం 3 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రధాన ట్రాఫిక్‌ సమస్య-ప్రమాదాలకు చెక్‌ పెట్టొచ్చని కేరళ భావించింది.  హైదరాబాద్‌కు చెందిన కేఎంసీ కంపెనీ, సబ్‌కాంట్రాక్ట్‌తో ది ప్రగతి గ్రూప్‌లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి. 2016, జూన్‌లో టన్నెల్‌ పేలుడుతో మొదలైన పనులు.. ఐదేళ్లుగా నడుస్తూ వచ్చాయి. దీంతో సౌత్‌లోనే ఇదొక సుదీర్ఘమైన ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. సుమారు 200 కోట్లు(లెక్కల్లో 165 కోట్లు), ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు సొరంగ మార్గాల నిర్మాణం పూర్తైంది.
 

అయితే ఒకవైపు నిర్మాణ సంస్థ నుంచి మరోవైపు ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) నుంచి ఈ సొరంగాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని  ఆరాతీయగా.. ఆగస్టులో ఈ టన్నెల్‌ లాంఛింగ్‌ ఉండొచ్చని బదులిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేసేదాకా.. కేరళ అధికారులకు, మంత్రులకు, ఆఖరికి సదరు కంపెనీకి సైతం ఈ సొరంగ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలియకపోవడం విశేషం. 

ఇక సాయంత్రం ఐదు గంటలకు త్రిస్సూర్‌ జిల్లా కలెక్టర్‌ హరిత కుమార్‌కు, ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) డైరెక్టర్‌కు మాత్రమే కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వాళ్లు టన్నెల్‌ దగ్గరికి చేరుకుని.. 7గం.55ని.ఎడమ టన్నెల్‌ను ప్రారంభించగా సామాన్యుల రాకపోకలను అనుమతి లభించింది. అయితే ఇది దారుణమని, అయినప్పటికీ ప్రజలకు పనికొచ్చే పని కావడంతో విమర్శలు-వివాదం చేయదల్చుకోలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు కుడి సొరంగమార్గాన్ని డిసెంబర్‌ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజల నుంచి టోల్‌ కలెక్షన్‌, మన్నూథి-వడక్కన్‌చెరీ ఆరులేన్ల రోడ్‌(కిలోమీటర్‌ మేర) పూర్తయ్యాకే వసూలు చేయాలని కేఎంసీ కన్ స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌కు కేరళ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఈ రోడ్‌ నిర్మాణ సమయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపించాయి కాబట్టి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు